Mad dog bites more than 25 people: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో ఓ వీధికుక్క వీరంగం సృష్టించింది. అరగంట వ్యవధిలోనే 26 మందికి పైగా జనాలపై దాడి చేసింది. హరి కీ పైడి సమీపంలోని బిర్లా ఘాట్ ప్రాంతంలో ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో అనేక మందికి కాట్లు పడగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహానికి గురైన ప్రజలు కర్రలతో కొట్టి కుక్కను చంపేశారు.
"దర్శనం అనంతరం విశ్రాంతి కోసం రోడ్డు పక్కన కూర్చున్నాను. ఇంతలోనే ఓ కుక్క వచ్చి నాపై దాడి చేసింది. అంతకుముందే చాలా మందిని కరిచి వచ్చింది. అయినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు"
-ప్రవీన్ కుమార్ గోయల్, యాత్రికుడు
ఆస్పత్రిలో 26 మంది చేరారని.. వారందరికీ రేబీస్ ఇంజెక్షన్లు ఇచ్చామని వైద్యులు తెలిపారు. వీరిలో స్థానికులతో పాటు యాత్రికులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరిద్వార్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ ఘటనతో అప్రతిష్ఠ పాలవుతుందని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తునారు. ఆవులు సైతం రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయని.. అనేక మంది చనిపోతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.
ఇదీ చదవండి:మహిళపై సజీవ దహనానికి విఫలయత్నం.. నాలుక కోయాలని ప్రయత్నించి..