Uttar Pradesh love jihad case: లవ్ జిహాద్ కేసులో తొలిసారి విచారణ చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో బలవంతంగా మత మార్పిడికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధించింది.
కాన్పుర్‌లోని జుహిపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్చి బస్తీ ప్రాంతానికి చెందిన జావెద్ అనే వ్యక్తి.. 2017, మే 15న మైనర్ బాలికతో.. తనను హిందువుగా పరిచయం చేసుకున్నాడు. తన పేరును మున్నాగా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత బాలికను తనతో తీసుకెళ్లాడు.
ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు జుహిపుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన మరుసటి రోజునే బాలికను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని జైలుకు పంపారు.
సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని చెప్పి జావెద్ తీసుకెళ్లినట్లు చెప్పింది బాలిక. అతని ఇంటికి వెళ్లాకే.. మతం గురించి చెప్పాడని, పెళ్లి చేసుకోవాలని కోరగా.. తిరస్కరించినట్లు వెల్లడించింది. తనను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
బాధితురాలి వాంగ్మూలం మేరకు జిల్లా అదనపు జడ్జి.. జావెద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.