కన్నడ రాజకీయాల్లో దుమారం రేపిన రమేశ్ జర్కిహోళి సీడీ కేసు.. కొత్త వీడియో, ఆడియోలతో కీలక మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి రమేశ్‌తో అసభ్యకరమైన వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ.. సీడీలో ఉన్నది తాను కాదని కుటుంబ సభ్యులకు చెబుతున్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్ అయిన మరుసటి రోజునే మరో వీడియో బయటకు వచ్చింది. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని అందులో అభ్యర్థించారు సదరు మహిళ.
వీడియోలో ఏముంది?
సీడీ కేసుకు సంబంధించి విడుదల చేసిన నాలుగో వీడియోలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు మహిళ.
"నరేశ్‌కు ఫోన్ చేసి సీడీ గురించి చెప్పాను. తాను చాలా చిన్నవాడినని, దీనికి రాజకీయంగా మద్దతు అవసరమని చెప్పాడు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను కలవాలని సూచించాడు. నా పరిచయాల ద్వారా వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా. నా కుటుంబం సురక్షితంగా లేదని చెప్పేందుకే ఆడియో క్లిప్ విడుదల చేశా. నేను ఏది చెప్పినా అది ప్రతికూలంగా మారుతోంది. గత 24 రోజులుగా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏమి చేయాలో తోచటం లేదు. నేను బాధితురాలిని, నాకు న్యాయం కావాలి. ప్రభుత్వాన్ని ఒక్కరోజులో పడగొడతానని రమేశ్ జర్కిహోళి చెప్పారు. ప్రతి ఒక్కరిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. దాని అర్థం ఏమిటి? రేపు వాళ్లు మా కుటుంబాన్ని చంపుతారు. కాబట్టి నా కుటుంబానికి రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నా. వారిని బెంగళూరు తీసుకెళ్లి భద్రత కల్పించండి. దర్యాప్తు బృందానికి.. నా కుటుంబ సభ్యుల ముందే వివరాలు వెల్లడిస్తా. జర్కిహోళి పేరు రాసి చనిపోవాలనిపిస్తోంది." అని ఆ వీడియోలో చెప్పారు సదరు మహిళ.