తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అక్రమ వలసదారులే మమత ఓటు బ్యాంకు'

అక్రమ వలసదారులే నిజమైన బంగాలీయేతరులని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వారే మమతా బెనర్జీ, వామపక్షాలు, హస్తం పార్టీకి ఓటు బ్యాంక్​ అని ఆరోపించారు. "నేను భారత్ లో పుట్టాను.. ఇక్కడే చస్తాను.. నన్ను ఇక్కడే దహనం చేస్తారు" అని షా అన్నారు.

Shah
అమిత్ షా

By

Published : Apr 22, 2021, 7:38 PM IST

భాజపా నేతలను బయటి వ్యక్తులుగా అభివర్ణిస్తోన్న మమతా బెనర్జీపై కేంద్ర హాంశాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీకి ఓటు బ్యాంకుగా ఉన్న అక్రమ వలసదారులే అసలైన బయటి వ్యక్తులని ఆరోపించారు. వారి మద్దతుతోనే రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని దీదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న వేళ.. భాజపా, తృణమూల్‌ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీ, అమిత్‌ షా వంటి నేతలను బయటి వ్యక్తులుగా పేర్కొంటున్న మమతా బెనర్జీ.. ప్రతి ప్రచార సభలోనూ వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి ఘాటుగా స్పందించారు. కేవలం ప్రధానమంత్రిని, నన్ను(అమిత్‌ షా) దూషించడమే మమతా బెనర్జీ ఎజెండగా పెట్టుకున్నారు. ప్రతి ప్రచార సభలో దీదీ 10నిమిషాలు మమ్మల్ని తిట్టడానికే కేటాయిస్తుంది. నేను దేశానికి హోంశాఖ మంత్రిని.. నేను ప్రజలతో మాట్లాడకూడదా..? నేను బయట వ్యక్తిని ఎలా అవుతాను? అని అమిత్‌ షా ప్రశ్నించారు. ఈ దేశంలో పుట్టిన నేను.. నా మరణం తర్వాత నా దేహాన్ని ఈ పవిత్ర భూమిపైనే దహనం చేస్తారు. కానీ, మీరు మద్దతు కోరుతున్న అక్రమ వలసదారులే నిజమైన బయటవ్యక్తులు అని విమర్శించారు. వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీలకు కూడా ఈ బయట వ్యక్తులే ఓటు బ్యాంక్ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా దుయ్యబట్టారు.

వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు పశ్చిమ బెంగాల్‌పై సవతి తల్లి ప్రేమ కురిపించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని దక్షిణ దినాజ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా బెంగాల్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 శాసనసభ స్థానాలకు గానూ ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆరు దశల్లో 223 స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా మరో రెండు దశల్లో 71 స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. మే 2 ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇదీ చదవండి:మోదీ బంగాల్​ పర్యటన రద్దు

ABOUT THE AUTHOR

...view details