పర్యావరణానికి అనుకూలించేలా, కర్బన ఉద్గారాల్ని తగ్గించేలా బ్యాక్టీరియా ద్వారా బయోసిమెంట్ తయారీ ప్రక్రియను అభివృద్ధి చేసినట్టు ఐఐటీ మద్రాస్ శుక్రవారం ప్రకటించింది. మైక్రోబియల్లీ ఇండ్యూస్డ్ కాల్సైట్ ప్రిసిపిటేషన్ (ఎంఐసీపీ) ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియాను ఉపయోగించి ఈ సిమెంటును రూపొందించవచ్చని ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ జి.కె.సురేష్‌కుమార్, సహాయ ప్రొఫెసర్ నీరవ్ భట్, స్కాలర్ శుభశ్రీ శ్రీధర్ తెలిపారు.
గతేడాది గ్లాస్గోలో జరిగిన యూఎన్ వాతావరణ మార్పుల సదస్సులో 140 దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ ప్రధానంగా కర్బన ఉద్గారాల్ని జీరో స్థాయికి తేవడంపై చర్చ జరిగింది. ఈ ఉద్గారాలను సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా వదులుతున్నట్లు చర్చకు వచ్చిందని వివరించారు. దీని నియంత్రణ కోసం బయోసిమెంటు ప్రక్రియను వృద్ధి చేసినట్లు ప్రకటించారు. మైక్రోబియల్ ప్రక్రియను సమగ్రంగా అర్థం చేసుకుంటే బయోసిమెంట్‌ను తయారుచేసే బయోరియాక్టర్లను కచ్చితంగా రూపొందించే అవకాశముందని ప్రొఫెసర్ జి.కె.సురేష్‌కుమార్ తెలిపారు.