గంగా నదిని శుభ్రపరిచేందుకు ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ పరిశోధకులు పర్యావరణ హిత విధానాన్ని కనుగొన్నారు. వరి పొట్టు, ఇతర పదార్థాలను ఉపయోగించి మురికి నీటి నుంచి ప్రమాదకరమైన భార లోహాలను తొలగించే అబ్సార్బెంట్ను తయారు చేశారు. స్కూల్ ఆఫ్ బయోకెమికల్ ఇంజినీరింగ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. విశాల్ మిశ్రా, పీహెచ్డీ విద్యార్థులు వీర్ సింగ్, జ్యోతి సింగ్ ఈ పరిశోధనలో భాగమయ్యారు.
కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్‌కు కారణమయ్యే ప్రమాదకర లోహపు అయాన్లను సైతం నీటి నుంచి తగ్గించగలిగినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన వివరాలు 'రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కెమికల్ ఇంజినీరింగ్' పత్రికలో ప్రచురితం అయ్యాయని డా. మిశ్రా తెలిపారు.
"నీటి కాలుష్యంపై మేం పరిశోధన చేశాం. మురికి నీటిలో క్రోమియం, క్రానియం, సీసం వంటి భార లోహాలు ఎన్నో ఉంటాయి. పరిశోధనలో భాగంగా వరి పొట్టును ఉపయోగించాం. వరి పొట్టుకు డోపింగ్ చేసి ప్రత్యేకమైన ఐరన్ ఎంజైమ్‌ను తయారు చేశాం. దాని వల్ల నీటిలోని క్రోమియం పరిమాణం తగ్గుతుంది. క్రోమియం-6, క్రోమియం-3 లోహాలు.. ఉన్నావ్, కాన్పుర్ వద్ద గంగా నదిలో అధికంగా కనిపిస్తాయి. క్యాన్సర్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, సహా ఇతర వ్యాధులకు హెక్సావాలెంట్ క్రోమియం కారణమవుతుంది. నీటిలో నుంచి ఈ ప్రమాదకరమైన లోహాన్ని తొలగించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడింది."