హై కమాండ్ నిర్ణయమే తన నిర్ణయమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. అధిష్ఠానం చెబితే సీఎం పదవి నుంచి వైదొలిగేందుకు క్షణం కూడా ఆలోచించనని అన్నారు.
కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారనే వార్తలు ఈ మధ్య రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
"హై కమాండ్ ఎప్పటివరకు ఉండమని చెబితే అప్పటివరకు పదవిలో కొనసాగుతా. ఒకవేళ హై కమాండ్ సీఎంగా తప్పుకోవాలని చెబితే.. వెంటనే పదవికి రాజీనామా చేస్తా. కానీ, భాజపా అధిష్ఠానం నాపై పూర్తి నమ్మకంతో ఉంటుంది."
--యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
పార్టీలో భిన్నాభిప్రాయలేమీ లేవని యడియూరప్ప స్పష్టం చేశారు. హైకమాండ్ తనపై పూర్తి నమ్మకంతోనే సీఎం పదవి అప్పజెప్పిందని అన్నారు. ఇక తుది నిర్ణయం అదిష్ఠానం చేతుల్లోనే ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం స్పందించారు.
"యడియూరప్ప సీఎంగా తప్పుకుంటారనే ప్రశ్నే లేదు. అసలు ఈ విషయంపై ఎక్కడా చర్చలు జరగటంలేదు. పార్టీకి ఆయన ఓ సైనికుడు లాంటి వారు. అందుకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తా అని ఆయన చెప్పారు."
--డాక్టర్. సీఎన్ అశ్వథ్ నారాయణ్, డిప్యూటీ సీఎం.