ఎన్నికల్లో ఓడిపోతాననే అసహనంతోనే కేంద్ర సాయుధ బలగాల(సీఏపీఎఫ్)పై బంగాల్ సీఎం మమతా బెనర్జీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో తొలి మూడు విడతల్లో పోలింగ్ జరిగిన 91 స్థానాల్లో 63 నుంచి 68 సీట్లు భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోల్కతాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతపై శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు.
"మమతా బెనర్జీలా కేంద్ర సాయుధ దళాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర పదజాలం వాడే ముఖ్యమంత్రిని, రాజకీయ పార్టీ అధ్యక్షులను నేను చూడలేదు. ఆమె అరాచక పాలన చేయాలనుకుంటున్నారా? అల్లర్లు సృష్టించాలని అనుకుంటున్నారా? మమతకు కొంత ఇంగితజ్ఞానం అవసరం. ఎన్నికల వేళ కేంద్ర బలగాలు హోంశాఖ కింద పనిచేయవు. ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటాయి."
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఓటర్లను సీఎపీఎఫ్ దళాలు బెదిరిస్తున్నాయని మమత చేసిన ఆరోపణలను అమిత్షా ఖండించారు. ముస్లిం ఓట్లు చీలకుండా ఉండాలని ఆమె చేసిన విజ్ఞప్తే.. వారు టీఎంసీకి దూరమవుతున్నారని అనడానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. చొరబాట్లను అరికట్టడంలో మమత సర్కారు వైఫల్యం, సీఏఏను వ్యతిరేకించడం, బుజ్జగింపు రాజకీయాలతో బంగాల్ ప్రజలు విసిగిపోయారని చెప్పారు.