నందిగ్రామ్‌లో తనను బయటి మనిషిగా అభివర్ణిస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలా మాట్లాడే వారికి.. 'గుజరాత్' నుంచి వచ్చిన వారే సొంత మనుషులని పరోక్షంగా మోదీ, అమిత్ షాను ఉద్దేశించి విమర్శించారు.
నందిగ్రామ్ నుంచి బంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్న మమత.. బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం నందిగ్రామ్‌లోని టీఎంసీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తమ ఆత్మను గుజరాత్‌కు అమ్ముకున్న వారు.. మత రాజకీయాలతో నందిగ్రామ్ ఉద్యమాన్ని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా నేత సువేందు అధికారిపై తీవ్ర విమర్శలు చేశారు.
"నన్ను బయటి వ్యక్తిగా కొందరు అభివర్ణిస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. పక్కనే ఉన్న భీర్భుమ్ జిల్లాలో నేను పుట్టాను. అక్కడే పెరిగాను. నన్ను బయటి వ్యక్తిగా ఆరోపిస్తున్న మనిషి(సువేందు) కూడా ఇక్కడ పుట్టలేదు. వారికి.. ఈరోజున నేను బయటి వ్యక్తిగా మారాను. గుజరాత్ నుంచి వస్తున్న వారు సొంత మనుషులయ్యారు."
--- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
సువేందు.. అనేక మార్లు తనను తాను 'భూమిపుత్ర'గా అభివర్ణించుకున్నారు. అదే సమయంలో మమత బయటి వ్యక్తి అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మమత ఈ వ్యాఖ్యలు చేశారు.