Husband Built 13 Floor Building For Four wives : తన నలుగురు భార్యల కోసం ఏకంగా 13 అంతస్తుల ఇంటిని నిర్మించాడు ఓ వ్యక్తి. ఆ ఇంట్లో ఆరేళ్ల క్రితం వరకు భార్యలు, వారి పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాడు. అయితే ఆ వ్యక్తి.. రెండో భార్య కొన్నాళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోర్టు దంపతులిద్దరికీ విడాకులు మంజూరు చేసి.. భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది. ఆ భరణాన్ని నాలుగేళ్లు అయినా భర్త ఇవ్వకపోవడం వల్ల.. ఆ ఇంటిని కోర్టు స్వాధీనం చేసుకుంది. అప్పుడే ఆ 13 అంతస్తుల భవన నిర్మాణంలో జరిగిన అవకతవకలు బయటపడ్డాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో మీర్జాపుర్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే..
మీర్జాపుర్కు చెందిన సియారామ్ పటేల్‌కు నలుగురు భార్యలు. ఆయన తన భార్యల కోసం అదాల్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రుతిహార్ గ్రామంలో 22 ఏళ్ల క్రితం 13 అంతస్తుల ఇల్లును నిర్మించాడు. ఆ భవనంలోనే తన కుటుంబంతో కలిసి కొన్నాళ్ల క్రితం వరకు నివసించేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం సియారామ్ పటేల్ రెండో భార్య అర్చనా సింగ్.. భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అర్చనకు రూ.3,82,500 భరణం ఇవ్వాలని 2018లో చునార్ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. ఆ డబ్బును సియారామ్ తన భార్యకు ఇప్పటికీ ఇవ్వకపోవడం వల్ల అసలు విషయం బయటపడింది.
ఈ క్రమంలో సియారామ్ రెండో భార్య అర్చన తనకు భర్త నుంచి భరణం అందలేదని కోర్టును ఆశ్రయించింది. అప్పుడు కోర్టు.. సియారామ్ 13 అంతస్తుల ఇంటిని స్వాధీనం చేసుకుని.. వేలం వేయాలని నిర్ణయించింది. అప్పుడు సియారామ్ ఇంటికి వచ్చిన అధికారులకు గ్రామస్థులు విస్తుపోయే నిజాలు చెప్పారు. సియారామ్ బంజరు భూమిలో ఇల్లు నిర్మించాడని శ్రుతిహార్ గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడించారు.