ఆవుపేడ ప్రమిదలతో దీపావళికి సరికొత్తగా ముస్తాబవుతోన్న సిర్మౌర్ రానున్న దీపావళి హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ఈ పండుగలో ఇప్పటివరకు మట్టి ప్రమిదలు చూసి ఉంటారు. చైనా దీపాల మెరుపులు కళ్ల ముందు కదలాడవచ్చు. ఈసారి సిర్మౌర్‌లో మాత్రం ఆవుపేడతో దీపావళి ప్రమిదలు చేస్తున్నారు. మహిళల స్వయం ఉపాధిలో భాగంగా సిర్మౌర్ జిల్లా పశుసంవర్థక విభాగం ఈ కార్యక్రమం చేపట్టింది.
"ప్రమిదల తయారీలో మహిళల శిక్షణకు డీఆర్డీఏ ఆర్థిక సహకారం అందిస్తోంది. మా లక్ష్యం మహిళా స్వయం సహాయ బృందాలను ముందుకు తీసుకువచ్చి.. వారికి ఈ పని నేర్పించటమే."
- డా. నీరు షబ్ననమ్, పశుసంవర్థక విభాగం, సిర్మౌర్
బాలాసుందరి గో సదన్‌లో మహిళలకు ఆవుపేడతో ప్రమిదలు తయారుచేసే శిక్షణ ఇస్తున్నారు. దానివల్ల మహిళలకు ఇంటివద్దే ఉపాధి లభిస్తుంది. వారూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
"ఆవుపేడతో ప్రమిదలు ఎలా చేయాలో నేర్చుకోవటానికి వచ్చాను. ఈ శిక్షణతో ఉపాధి లభించి.. ఆదాయం పెరిగే అవకాశం ఉంది."
- కవితాదేవి, శిక్షణ పొందుతున్న మహిళ
"మహిళలు స్వయం శక్తితో నిలబడేలా.. ఆవు పేడతో ప్రమిదలు చేయటంపై ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం."
- కీర్తి, శిక్షణ పొందుతున్న మహిళ
జిల్లా యంత్రాంగం అధ్వర్యంలో..
జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమంలో 10 నుంచి 12మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. రోజూ వచ్చి ప్రమిదల తయారు చేయడాన్ని నేర్చుకుంటున్నారు. పైకి సాధారణంగా కనిపించే ఈ ప్రమిదల తయారీలో కొన్ని ప్రత్యేకతలూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
"ఈ ప్రమిదల్లో దీపం వెలిగించి పరీక్షించి చూశారు. పరిశీలన ప్రకారం అవి వేడెక్కడం లేదు. మళ్లీ ఉపయోగించవచ్చు. తర్వాత ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి చౌకైనవి, పర్యావరణహితమైనవి కూడా."
- డా. ఆర్.కె. పరుథి, సిర్మౌర్ జిల్లా కలెక్టర్
మహిళల సాధికారత కోసం..
ఆవుపేడ ప్రమిదల ద్వారా దీపావళికి ప్రత్యేకత తేవాలని భావిస్తోంది యంత్రాంగం. మహిళలు సాధికారితకూ ఈ సందర్భం వేదిక కానుంది. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం.
"ఇది మహిళలకు కూడా మంచి ఆదాయ వనరు. దీపావళి నాటికి 20వేల ప్రమిదలు చేయాలనేది లక్ష్యం. ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. తద్వారా మహిళలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది."
- నీరు షబ్ననమ్, పశుసంవర్థక విభాగం, సిర్మౌర్
ఈ ప్రమిదల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం కోసం చూస్తున్నారు అధికారులు. అందులో వీధి పశువుల సంఖ్య తగ్గించటం ఒకటి. ఈ ప్రచారం ద్వారా వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదానికీ మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
"పశువులను వీధుల్లో వదిలేయకుండా చూడటంలో స్వయం సహాయక బృందాల సాయం తీసుకుంటాం. రానున్న దీపావళి పర్యావరణహితమైనదే కాదు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని కూడా విజయవంతం చేస్తుంది."
- డా. ఆర్.కె. పరుథి, సిర్మౌర్ జిల్లా కలెక్టర్
ఆ సమస్యను నివారిస్తూనే..
నిజానికి వీధుల్లో వదిలేస్తున్న పశువులు ప్రతి రాష్ట్రంలో సమస్యగా మారుతున్నాయి. అలా పశువులు బయటకు వదిలేసేవారికి ఈ ప్రమిదల తయారీ కొత్త ఆదాయమార్గం చూపుతోంది. స్థానికులకు అధికారులూ అదే చెబుతు న్నారు.
"పశువులను వీధుల్లో వదిలిపెట్టేయొద్దనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాలు ఇవ్వకున్నా ఆవు మూత్రం, పేడ ఎంతో విలువైనవి. వాటిని సరిగ్గా ఉపయోగించు కోవటంలో శిక్షణ ఇవ్వటం ద్వారా మంచి ఆదాయమార్గంగా మార్చవచ్చు."
- డా. నీరు షబ్ననమ్, పశుసంవర్థక విభాగం, సిర్మౌర్
మొత్తం మీద ఆవు పేడతో ప్రమిదల ఆలోచన అనేక సమస్యలకు పరిష్కారం చూపుతోంది. రానున్న దీపావళి ఆవుపేడ ప్రమిదలతో కొత్త కాంతులీనడమే కాదు.. వాటిని తయారు చేసే మహిళలకు సాధికారత మార్గం చూపుతోంది.
ఇదీ చదవండి:మళ్లీ ట్రాక్ ఎక్కిన 115 ఏళ్ల నాటి స్టీమ్ రైలు