Road Accident: హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు, స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు సైతం ఉన్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కులు జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు.
లోయలో పడ్డ బస్సు.. స్కూల్ పిల్లలు సహా 12 మంది మృతి.. ప్రధాని విచారం
09:59 July 04
లోయలో పడ్డ బస్సు.. స్కూల్ పిల్లలు సహా 12 మంది మృతి.. ప్రధాని విచారం
అదే కారణం:సైంజ్ ప్రాంతానికి వెళ్తున్న బస్సు.. జంగ్లా గ్రామ సమీపంలో ఉన్న లోయలో అదుపుతప్పి పడిపోయిందని కులు జిల్లా ఎస్పీ చెప్పారు. బస్సు అదుపుతప్పిన ప్రదేశంలో ముందురోజే కొండచరియలు విరిగిపడ్డాయని.. డ్రైవర్ వాటిపై నుంచి బస్సును దాటించేందుకు ప్రయత్నించగా ఈ దుర్ఘటన జరిగినట్లు బంజర్ ఎమ్మెల్యే సురేందర్ శౌరీ వెల్లడించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను సమీపంలోని ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు సడన్గా స్కిడ్ అయిందని.. అప్రమత్తమయ్యేలోపే ప్రమాదం జరిగిపోయిందని బస్సు కండెక్టర్ గోపాల్ వెల్లడించారు. ఎవరినీ కాపాడేంత సమయం కూడా దొరకలేదని తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ..
బస్సు లోయలో పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతికి చేకూరాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు తక్షణ సాయంగా రూ.15వేలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి జయరామ్ ఠాకుర్ ప్రకటించారు. బాధితులకు కేంద్రం సాయం అందించడంపై ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు ఠాకుర్.
ఇవీ చదవండి:టీచర్ కర్కశం.. స్పృహ తప్పిపోయేలా విద్యార్థిని చితకబాది..