How To Join Indian Armed Forces :సైనికుడు, జవాన్, ఆర్మీ.. ఇలా పేరేదైనా అందరి అంతిమ లక్ష్యం దేశాన్ని ఇతర రాజ్యాల దాడుల నుంచి రక్షించడమే. అయితే ఇలాంటి అవకాశాన్ని పొందేందుకు దేశంలో కేవలం NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) నిర్వహించే త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే అని చాలా మంది అనుకుంటారు. NDA రిక్రూట్మెంట్ అనేది అతి కఠినమైన నియామక ప్రక్రియ అని అనేక మంది అభ్యర్థులు భావిస్తుంటారు. ఇది వాస్తవమే. దీనిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లే చాలామంది అనేక ప్రయత్నాలు చేసి చేసి ఏజ్ మధ్యలోనే డ్రాప్ అవుతుంటారు. అంతేకాకుండా వీటిల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉండటం కారణంగా కూడా చాలామంది ఇక్కడితో ఇక తాము దేశానికి సేవ చేయలేమోనని బాధపడుతుంటారు. కానీ, ఈ అవకాశాన్ని పొందేందుకు దేశంలో కేవలం NDA ద్వారానే కాకుండా ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా భరతమాత భూభాగాలకు రక్షణగా ఉంటూ మీ సేవలందించవచ్చు. మరి ఆ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.
CDS Exams :
- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహిస్తుంది.
- ఈ ప్రక్రియ ద్వారా కూడా త్రివిధ దళాలకు సంబంధించిన విభాగాల్లోకి ప్రవేశించవచ్చు.
- ఈ పరీక్ష ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది.
- డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- 19-25 ఏళ్ల మధ్య ఉండే అభ్యర్థులు CDS ద్వారా ఉద్యోగం సంపాదించవచ్చు.
- ఏజ్ లిమిట్ అనేది మీరు ఎంచుకునే విభాగాలపై ఆధారపడి ఉంటుంది.
- రాతపరీక్ష, SSB ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
- ఆర్మీ కోసం అప్లై చేసుకునే వారు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా చదవచ్చు.
- నేవీలో సీటు పొందేందుకు అభ్యర్థులు డిగ్రీలో ఇంజినీరింగ్ లేదా సైన్స్ సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా చదివి ఉండాలి.
CAPF Exams :
- సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్.. ఈ పరీక్షను కూడా UPSC నిర్వహిస్తుంది.
- ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా పారామిలటరీ బలగాల్లో కొలువు సంపాదించవచ్చు.
- బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్(BSF), సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురిటీ ఫోర్స్(CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF), సశస్త్ర సీమా బల్(SSB) లాంటి విభాగాల్లో ఉద్యోగం చేయవచ్చు.
- ఈ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి.
- యూపీఎస్సీ నిర్వహించే రాతపరీక్ష, మెడికల్ ఫిట్నెస్ టెస్టుతో పాటు ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులను విధుల్లోకి తీసుకుంటారు.
AFCAT Exams :
- ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) పరీక్ష ద్వారా కూడా త్రివిద దళాల్లో ఒకటైన ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ కావచ్చు.
- ఈ పరీక్షను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నిర్వహిస్తుంది.
- పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఎగ్జామ్‌ను రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థుల వయసు 20-26 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఈ ఏజ్ లిమిట్ ఫ్లయింగ్, నాన్-ఫ్లయింగ్ విభాగాలపై ఆధారపడి ఉంటుంది.
- కావాల్సిన విద్యార్హతలు కూడా టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాలపై ఆధారపడి ఉంటుంది.