How to Apply New Ration Card in Telangana : దేశంలోని దాదాపు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడుతుంది. రేషన్ కార్డు వివరాలు వ్యక్తి గుర్తింపు, నివాసానికి సంబంధించిన ముఖ్యమైన రుజువుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు(Telangana Welfare schemes) పొందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా ప్రజలు చౌకగా రేషన్ సరుకులు పొందుతారు. ఈ పథకం ద్వారా ఎవరైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ కార్డు పేదలకు ఎంతో మేలు చేస్తుంది. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే వచ్చే సరుకులతో ఇల్లు గడుస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కింద రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది.
EPDS Telangana FSC Card Application Procedure : రేషన్ కార్డు ఉంటే.. తక్కువ ధరకే బియ్యం, గోధుమలు, చక్కెర లాంటి సరుకులను పొందవచ్చు. ఇలాంటి ప్రయోజనాలన్నీ పొందాలంటే మీరు చేయాల్సిందల్లా మీ పేరు మీద రేషన్ కార్డు(Ration Card) తీసుకోవడమే. నేటికి చాలా మంది రేషన్ కార్డులు తీసుకోని వారు ఉన్నారు. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారు గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటు నుంచే సులభంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంతకీ రేషన్ కార్డు పొందాలంటే ఏఏ పత్రాలు అవసరం, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం..
తెలంగాణలో రేషన్ కార్డుల రకాలు :రాష్ట్రంలో మూడు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అంత్యోదయ ఆహార భద్రత కార్డు (AFSC), ఆహార భద్రత కార్డు (FSC), అంత్యోదయ అన్న యోజన కార్డులు అమలులో ఉన్నాయి. అయితే ఈ కార్డులను పొందాలంటే సర్కార్ కొన్ని అర్హతలను పెట్టింది. వాటి ఆధారంగా ఎవరు ఏ కార్డుకు అర్హత పొందితే ఆ రేషన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
తెలంగాణ రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ప్రమాణాలివే..
Eligibility Criteria for New Ration Card in Telangana :
- అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర పౌరుడై ఉండాలి.
- కొత్త అప్లై చేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఎలాంటి రేషన్ కార్డులు కలిగి ఉండకూడదు.
- దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి (EWS) చెందినవారై ఉండాలి.
- పాత రేషన్ కార్డులు (గడువు ముగిసిన కార్డులు) ఉన్న అభ్యర్థి కొత్తదానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Required Documents for New Ration Card :
దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- చిరునామా రుజువు (విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, నీటి సరఫరా బిల్లు, టెలిఫోన్ బిల్లు మొదలైనవి).
- గుర్తింపు రుజువు (డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి).
- యాక్టివేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ
- మీ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ కాపీ
- గ్యాస్ కనెక్షన్ వివరాలు
రేషన్ కార్డు దరఖాస్తు కోసం అన్ని రాష్ట్రాలు వారి రాష్ట్రానికి సంబంధించి.. ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. మీరు ఆ వెబ్‌సైట్https://epds.telangana.gov.in/FoodSecurityAct/కి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు వచ్చే రశీదులో అప్లికేషన్ నంబర్ వస్తుంది. దాని ద్వారా EPDS తెలంగాణ పోర్టల్లోకి వెళ్లి మీ కార్డు స్టేటస్ సింపుల్గా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అనంతరం కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ఈపీడీఎస్ సేవలు పొందవచ్చు.