అసోం-మిజోరం సరిహద్దులో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో అపనమ్మకం, విద్వేషాలను నింపుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ భయంకర పరిణామాల పర్యవసనాలను దేశం ఇప్పుడు చవిచూస్తోందని అన్నారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్.. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతోపాటు హింసకు సంబంధించినదిగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కమిటీ ఏర్పాటు
మరోవైపు, ఈ ఘటనపై నిజనిర్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ చాచర్ సహా రెండు రాష్ట్రాల సరిహద్దులో అలజడులు తలెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ తెలిపింది. అసోం కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు భూపెన్ బోరా కమిటీకి నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది.