ఆయన పదహారేళ్ల వయసులోనే రెండు కళ్లూ కోల్పోయారు. అందరిలా తానూ తల్లడిల్లిపోయాడు. ఇక జీవితం ముగిసిపోయిందనుకున్న తరుణంలో.. ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పగలు, రాత్రికి తేడా తెలియని వేళ.. అంధత్వం అనే చీకట్లోనే తన జీవితానికి బాటలువేసుకున్నాడు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన త్రిలోచన్. స్వయంగా ఓ పిండి మిల్లును నడుపుతూ స్థానికుల మన్ననలు పొందుతున్నారు.
పిండి మిల్లు నిర్వహణ అంటే సాధారణంగానే కాస్త రిస్క్‌తో కూడుకున్న పని. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రమాదకరమే. అందులో అధిక ఓల్టేజీ విద్యుత్ మోటార్లు, పెద్ద పెద్ద మెషీన్లు అలా ఉంటాయ్ మరి. అయితే.. ఊనా ప్రాంతానికి చెందిన త్రిలోచన్ సింగ్ మాత్రం ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేకుండానే.. అద్భుతంగా మిల్లును నడుపుతున్నారు. 62 ఏళ్ల వయసులోనూ సింగ్ పనిచేస్తున్న తీరు.. ఆ యంత్రాలతో ఆయనకున్న సమన్వయం చూసి స్థానిక ప్రజలు నివ్వెరపోతున్నారు.