హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఎంపిక విషయం ఎటూ తేలట్లేదు. ఈ పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎంను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ప్రియాంక నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే శుక్రవారం రాత్రి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు.. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
ఎటూతేలని హిమాచల్ సీఎం ఎంపిక.. ప్రియాంక గాంధీ చేతికి బాధ్యతలు - himachal pradesh election 2022
హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా పదవి ఆశిస్తున్న వారిలో పలువురు నేతలు ఉన్నారు.
మరోవైపు హిమాచల్ సీఎం ఎంపికకు అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం మరోసారి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, శాసనసభాపక్ష మాజీ నేత ముకేశ్ అగ్నిహోత్రి, వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరభద్రసింగ్ కుటుంబానికే సీఎం పదవిని ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు ప్రతిభా సింగ్ కూడా సీఎం పదవిని తాను ఆశిస్తున్నట్లు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను ఖర్గేతో కలిసి ప్రియాంక గాంధీ భుజానెత్తుకున్నారు. అనేక వ్యూహరచనలు చేయడంతో పాటు విరివిగా ప్రచారంలో పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో అధికార భాజపాను ఓడించడంతో ఆమె నాయకత్వాన్ని పలువురు నేతలు ప్రశంసించారు. ఎన్నికల బాధ్యతల్లో ప్రియాంకకు ఇదే తొలి విజయం.