త్వరలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డాక్టర్లు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. చంబాలోని భర్మౌర్ స్థానానికి భాజపా తరఫున జనక్ రాజ్ అనే న్యూరోసర్జన్ పోటీ చేస్తున్నారు. అయితే తాము రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన వైద్య వృత్తిని మరువము అనేందుకు ఉదాహరణగా ఈ డాక్టర్ చేసిన ఓ పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బండ్లా ప్రాంతంలో తిరుగుతున్న డాక్టర్ వద్దకు ఓ వృద్ధురాలు వచ్చారు. నడుము నొప్పితో బాధపడుతున్న ఆమె.. తనను పరీక్షించమని కోరారు. దీంతో మెడికల్ రిపోర్టులను పరిశీలించిన జనక్‌రాజ్.. జనసంద్రంలోనూ చీటీలో మందులు రాసి వృద్ధురాలికి ఇచ్చారు. సరైన వైద్య పరికరాలు లేనప్పటికీ రోగి నాడి తెలుసుకునేందుకు మొబైల్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు.