తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సద్దుమణగని 'హిజాబ్' వివాదం.. ఆ కళాశాల మూసివేత! - కర్ణాటక హైకోర్ట్

Hijab controversy: విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. కర్ణాటకలో హిజాబ్​ వివాదం కొనసాగుతూనే ఉంది. బెళగావిలోని విజయ పారా వైద్య కళాశాలకు సెలవులు ప్రకటించారు. శివమొగ్గ జిల్లాలోని ఓ కళాశాలలో 58 మంది విద్యార్థులను సస్పెండ్​ చేసింది యాజమాన్యం. తమిళనాడులోనూ అక్కడక్కడా హిజాబ్​ ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Hijab controversy
'హిజాబ్' వివాదం

By

Published : Feb 19, 2022, 3:42 PM IST

Hijab controversy: కర్ణాటకలో కొద్ది కాలంగా కొనసాగుతున్న హిజాబ్​ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు హిజాబ్​ ధరిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెళగావి జిల్లాలోని విజయ పారా వైద్య కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ జరిగింది..

యూనిఫాం నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. విజయ పారా మెడికల్​ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు.. హిజాబ్​ ధరించి తరగతులకు హాజరయ్యారు. హిజాబ్​ తీసివేయాలని కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్​ ప్రకాశ్​ వారిని కోరగా.. అందుకు అంగీకరంచలేదు. తరగతులను బహిష్కరించి బయటకు వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తమ బుర్కాలు, నాకబ్​లు తరగతి గదికి వచ్చాక తీసేస్తామని, కానీ హిజాబ్​లు తీయబోమని స్పష్టం చేశారు. తమను క్లాసులకు అనుమతించాలని డిమాండ్​ చేశారు. ఆ తర్వాత ఓ విద్యార్థిని వెళ్లి ప్రిన్సిపాల్​తో మాట్లాడినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటించారు ప్రిన్సిపాల్​.

"హిజాబ్​పై వివాదం చెలరేగిన క్రమంలో కళాశాలకు సెలవులు ప్రకటించాం. దీనిపై డీసీతో మాట్లాడతాను. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కళాశాల మూసే ఉంటుంది. కాలేజీ తిరిగి తెరిచాక అదనపు తరగతులు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థికి హాని జరగకూడదనే ప్రస్తుతం సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం."

- డాక్టర్​ ప్రకాశ్​, కళాశాల ప్రిన్సిపాల్​.

58 మంది విద్యార్థుల సస్పెన్షన్​..

కర్ణాటక, శివమొగ్గ జిల్లా శిరాలకొప్పాలోని ప్రభుత్వ ప్రీయూనివర్సిటీ కళాశాలలో శనివారం.. హిజాబ్​ ధరించిన 58 మంది విద్యార్థులను సస్పెండ్​ చేశారు. దీంతో కళాశాల ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. తమను తరగతులకు అనుమతించాలని డిమాండ్​ చేశారు. తుముకూరు జిల్లాలో 20 మంది విద్యార్థులపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన మరుసటి రోజునే ఈ సంఘటన జరగటం గమనార్హం.

హైకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలని విద్యార్థులకు వివరించినప్పటికీ.. వారు హిజాబ్​ను తీసివేసేందుకు నిరాకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్​ తెలిపారు. దాంతో తాత్కాలికంగా వారిని సస్పెండ్​ చేసినట్లు చెప్పారు. దీంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. మరోవైపు.. బెళగావి, యాదగిరి, బల్లారి, చిత్రదుర్గమ్​, శివమొగ్గ జిల్లాల్లోనూ విద్యార్థులు హిజాబ్​లు ధరించి తరగతులకు హాజరవటం ఉద్రిక్తతలకు దారితీసింది.

హిజాబ్​ ధరించి ఓటు వేస్తేందుకు వస్తే..

హిజాబ్​ వివాదం తమిళనాడులోనూ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మదురైలోని ఓ పోలింగ్​ స్టేషన్​కు హిజాబ్​ ధరించి వచ్చిన ఓటరు, భాజపా బూత్​ ఏజెంట్​ మధ్య వాగ్వాదం జరిగింది. మేలూరులో హిజాబ్​ ధరించిన ఓ మహిళా ఓటరు.. ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం వ్యక్తం చేశాడు భాజపా ఏజెంట్​. ఆమెను గుర్తించలేకపోతున్నట్లు చెప్పాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. గందరగోళానికి దారితీయగా పోలింగ్​ అధికారులు కలగజేసుకున్నారు. ఓటర్​ కార్డు ద్వారా ఆమెను గుర్తించినట్లు చెప్పారు. ఏజెంట్​ను బయటకు పంపించటం ద్వారా వివాదం సద్దుమణిగింది. డీఎంకే, ఏఐఏడీఎంకే సహా ఇతర పార్టీలు భాజపా ఏజెంట్​ తీరును తప్పుపట్టాయి.

ఇదీ చూడండి:మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు- అసెంబ్లీలో అంత్యాక్షరితో ఎమ్మెల్యేల నిరసన

ABOUT THE AUTHOR

...view details