హైకోర్టులు ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల కల్పనపై ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది.
కొద్దిరోజుల క్రితమే మేరఠ్‌లోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన సంతోష్ కుమార్ అనే కొవిడ్ బాధితుడు.. అక్కడి బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయి మృతి చెందాడు. అక్కడి వైద్య సిబ్బంది ఆయనను గుర్తించలేదు. పైగా శవాన్ని గుర్తు తెలియని మృతదేహంగా పరిగణించింది. ఈ పరిస్థితుల ఆధారంగా అలహాబాద్ హైకోర్టు ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ గ్రామీణ, చిన్న పట్టణాల వైద్య వ్యవస్ధలు 'దేవుడి దయ' మీద ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. కొవిడ్ కట్టడి కోసం యూపీ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని ప్రతి గ్రామానికి ఐసీయూ సదుపాయం ఉన్న రెండు అంబులెన్సులు, ప్రతి పట్టణానికి 20 అంబులెన్సుల చొప్పున సమకూర్చాలని ఆదేశించింది. ఐదు వైద్య కళాశాలను పీజీ వైద్య సంస్థలుగా మార్చాలని తెలిపింది.