కర్ణాటకలోని తీర ప్రాంతం, మలెనాడు నుంచి విదేశాలకు శాటిలైట్ ఫోన్ కాల్స్(satellite phone calls) వెళ్లినట్లు గుర్తించిన క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది నిఘా విభాగం. ఉత్తర కన్నడలోని దట్టమైన అటవీ ప్రాంతం, దక్షిణ కన్నడలోని ముడిపు ప్రాంతం సహా చిక్కమంగళూరు జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఈ ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత వారం నుంచి ఐదు కాల్స్‌ను గుర్తించినట్లు చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లో మైనారిటీలే(terrorist attacks in Kashmir) లక్ష్యంగా దాడులు జరుగుతున్న క్రమంలో ఉగ్రకదలికలపై అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక అధికారులకు సూచించాయి కేంద్ర నిఘా సంస్థలు. రాష్ట్రంలోని స్లీపర్ సెల్స్‌ను(sleeper cells) ఆక్టివేట్ చేసేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నాయి నిఘా సంస్థలు. ఓవైపు రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించిన క్రమంలోనూ ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అవి ఎక్కడి నుంచి చేస్తున్నాయో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.
కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాలైన శివమొగ్గ, చిక్కమంగళూరు, ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం సేకరించాయి కేంద్ర బలగాలు. ఆయా ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లను(satellite phone calls) వినియోగించినట్లు తెలిపాయి.