బిహార్‌లో 10 ఏళ్లుగా ఓ బాలుడిని చెట్టుకు కట్టేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానసిక సమస్యను ఎదుర్కొంటున్న ఆ బాలుడికి చికిత్స అందించలేక చెట్టుకు బంధిస్తున్నామని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన గోపాల్‌గంజ్‌కు జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న సేలంపుర్ గ్రామంలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే?.. బిహార్‌లోని సేలంపుర్ గ్రామంలో జనార్దన్ ప్రసాద్, సింధూదేవి దంపతులు తమ ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. పెద్ద కొడుకైన ఆకాశ్‌కు(13) నాలుగేళ్ల వయసులో తీవ్రమైన జ్వరం వచ్చింది. నిరుపేద కుటుంబం అవ్వడం వల్ల తమ బిడ్డకు మెరుగైన చికిత్స అందించలేక పోయారు. దీంతో ఆ బాలుడు మానసికంగా కుంగిపోయాడు. అప్పటి నుంచి ఆ బాలుడిని చెట్టుకు కట్టి ఉంచుతున్నారు తల్లిదండ్రులు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న స్థానిక ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిస్సహాయులైన ఆ తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.