HD Kumaraswamy Electricity Theft : దీపావళి సందర్భంగా తన ఇంటి వద్ద విద్యుత్ దీపాలను వెలిగించేందుకు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అక్రమంగా కరెంట్‌ను వాడుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రపంచంలోనే ఏకైక నిజాయితీపరుడైన కుమారస్వామి నివాసం నేరుగా అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో వెలిగిపోయిందని ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కరెంట్‌ను దొంగిలించేంత పేదరికం మాజీ సీఎంకు పట్టడం బాధాకరమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీ 'గృహ జ్యోతి' పథకం అర్హులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందజేస్తుందని.. 2,000 యూనిట్లు కాదని వ్యాఖ్యానించింది. బెంగళూరు జేపీ నగర్లో కుమారస్వామి నివాసానికి దీపావళి సందర్భంగా లైటింగ్ పెట్టి.. ఇంట్లోని మీటర్‌కు బదులుగా పక్కనున్న కరెంట్ స్తంభం నుంచే నేరుగా కనెక్షన్ ఇచ్చిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.
"కుమారస్వామి పేదరికంలో ఉంటే 'గృహ జ్యోతి' పథకానికి దరఖాస్తు చేసి ఉండాల్సింది. ఓహో గృహజ్యోతి పథకం కింద ఒక విద్యుత్ మీటర్ మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయం మీకు తెలియదు కదా. మీ పేరు మీద చాలా మీటర్లు ఉన్నాయి. అందుకే మీరు గృహ జ్యోతి పథకానికి అర్హులు కారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ.. రైతులకు 7గంటల కరెంట్‌ను కాంగ్రెస్ అందిస్తోంది. కుమారస్వామి విలేకరుల సమావేశం పెట్టి.. కర్ణాటక అంధకారంలో ఉంది అని చెప్పి.. ఇప్పుడు దొంగ కరెంట్‌తో ఆయన ఇంటి విద్యుత్ దీపాలను వెలిగించలేదా? కుమారస్వామి ఇల్లు దీపాల కాంతులతో మెరిసిపోతుంటే.. రాష్ట్రం అంధకారంలో ఉందని ఎందుకు చెబుతున్నారు?" అని కాంగ్రెస్ ఎక్స్ వేదికగా కుమారస్వామిపై విమర్శలు గుప్పించింది. మరోవైపు.. బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ కుమారస్వామిపై చర్యలు తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కుమారస్వామిపై కేసు నమోదు చేస్తారో? లేదో మాత్రం తనకు తెలియదన్నారు.
నాకు తెలియదు..
కాంగ్రెస్ ఆరోపణలపై జేడీఎస్ నాయకుడు కుమారస్వామి స్పందించారు. ఇంటికి విద్యుత్ స్తంభం నుంచి నేరుగా కనెక్షన్ ఇచ్చారని తొలుత తనకు తెలియదన్నారు కుమారస్వామి. తెలిసిన వెంటనే దాన్ని తొలగించి.. ఇంటి కరెంట్ మీటర్‌కు కనెక్షన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో తనది తప్పుకాదన్నారు. "బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ అధికారులు వచ్చి తనిఖీ చేసి నాకు నోటీసు జారీ చేయనివ్వండి. నేను జరిమానా చెల్లిస్తాను. నేను ఎలాంటి ప్రభుత్వ ఆస్తులను అపహరించలేదు. ఎవరి భూమిని లాక్కోలేదు." అని కుమారస్వామి స్పష్టం చేశారు.