సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో 80 రోజులకుపైగా ఆందోళనలు చేస్తున్నారు రైతులు. వారికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. హరియాణాలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా దిల్లీ సరిహద్దులకు సమీపంలోని గ్రామస్థులు రైతులకు అండగా నిలుస్తున్నారు. వారికి అవసరమైన కూరగాయలు, పాలు వంటి నిత్యవసరాలను సమకూర్చుతున్నారు.
సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. సమీప గ్రామాల నుంచి నిత్యవసరాలను అందుకుంటున్నారు.
" వట్టి చేతులతో మేము ఇక్కడకు రాలేము. ప్రతి ట్రాలీ కూరగాయలు, పాలు, నెయ్యి, పండ్లు, పప్పులు, ఏది ఉంటే అది తీసుకొని వస్తుంది. ప్రతి ఇంటి నుంచి ఆహార దినుసులు లేక నగదు వంటివి రైతులకు అందించాలని ఖాప్ పంచాయతులు సూచించాయి. "
- మనీశ్ కుమార్, రైతు, మహేంద్రగఢ్ జిల్లా
సింఘు సరిహద్దుకు సమీప జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం పురుషులు, మహిళలు ట్రాక్టర్ ట్రాలీల్లో సింఘూ సరిహద్దుకు చేరుకుని సాయంత్రం తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నారు.
జింద్ జిల్లాలోని ఓ గ్రామం నుంచి సింఘూ సరిహద్దుకు చేరుకుంది 40 మందితో కూడిన బృందం. దానికి సత్పాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆందోళనలను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇక్కడికి చేరుకుంటున్నట్లు చెప్పారు.
" నిరసనల్లో పాల్గొనేందుకు ప్రజలను పంపాలని ప్రతి పంచాయతీకి నిర్దిష్టమైన తేదీ కేటాయించారు. ఆందోళనలను బలోపేతం చేసేందుకు మేము ఇక్కడికి వచ్చాం. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తాం. రేపు ఉదయం మా గ్రామం నుంచి మరో ట్రాలీ వస్తుంది. "
- సత్పాల్, జింద్ జిల్లా
ఇదీ చూడండి:ఆగని 'అణచివేత'- ప్రమాదంలో ప్రజాస్వామ్యం