హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అరుదైన ఘనత సాధించారు. ఐదు దశాబ్దాల తర్వాత ఆయన తన డిగ్రీ పట్టాను అందుకున్నారు. అయితే ఆయన ఇన్ని రోజులు డిగ్రీ పట్టా తీసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
నిజానికి మనోహర్ లాల్ ఖట్టర్ 1972లో దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ ఏడాది నుంచి 1980 వరకు దాదాపు ఎనిమిదేళ్లు ఆయన దిల్లీ లోనే ఉన్నారు. కానీ తన డిగ్రీ పట్టా తీసుకోలేదు. దీనికి కారణం.. అప్పటి నుంచి యూనివర్సిటీకి వెళ్లకపోవడమేనని ఖట్టర్ వెల్లడించారు. కాగా, శుక్రవారం దిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ చేతుల మీదుగా తన డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
"నేను మఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాథమిక పాఠశాల, హై స్కూల్, రోహ్తక్లో ఉన్న కాలేజీకి వేళ్లాను. కానీ దిల్లీ యూనివర్సిటీ(డీయూ)కి లేకపోయాను. దిల్లీ విశ్వవిద్యాలయానికి రావడం నా కల. ఇక్కడికి వస్తే మంచి అనుభూతి కలుగుతుంది. నేను 1972 నుంచి 1980 వరకు దిల్లీలోనే ఉన్నాను. ఇక్కడి నుంచే దేశానికి సేవ చేయాలని స్ఫూర్తి పొందాను" అని మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
డిగ్రీ పట్టా అందుకుంటున్న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విద్యార్థులు సరైన దిశను ఎంచుకుని.. భవిష్యత్‌లో ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని ఖట్టర్ సూచించారు. బావిలో కప్పలా కాకుండా.. విద్యార్థులు పెద్దగా ఆలోచించాలని కోరారు. "సైన్స్ మనకు ఆయుధం ఎలా తయారు చేయాలో నేర్పుతుంది. కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే.. అంతా నాశనం అవుతుంది" అని విద్యార్థులకు హితోపదేశం చేశారు. అనంతరం కల్చరల్ కౌన్సిల్ ఆఫ్ దిల్లీ పీఆర్ఓ, ఛైర్ పర్సన్ రచించిన పుస్తకాన్ని.. ఖట్టర్ ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో హరియాణా జానపద సంస్కృతికి చెందిన 150 పాటలు ఉన్నట్లు తెలిపారు.
పుస్తకావిష్కరణ తర్వాత దిల్లీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన 'హర్ ఘర్ ధ్యాన్' అనే కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆద్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'మెడిటేషన్, మానసిక ఆరోగ్యం' అనే అంశంపై ప్రసంగించారు. డీయూ వీసీ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి గణాంకాలు వెల్లడించారు. "ప్రస్తుత తరుణంలో ఒత్తిడే అతిపెద్ద సమస్య. మానవాళికి మెడిటేషన్, మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. మెడిటేషన్‌తో ఈ సమస్యను ఎదుర్కొని త్వరలోనే భారత్ ప్రపంచానికి దిక్సూచి అవుతుందని ఆకాంక్షిస్తున్నా" అని అన్నారు.
అనంతరం ఖట్టర్ మాట్లాడుతూ.. "ఏదో ఒక విషయం గురించి ఆలోచించే బదులు.. ఏదైనా పని చేయడంలో ప్రజలు ఫోకస్ పెట్టాలి. డిగ్రీ పట్టా సంపాందించి.. ఉద్యోగం చేయడం జీవిత లక్ష్యం కాకూడదు. జీవితాన్ని చూసే దృక్పథం పెద్దగా ఉండాలి. అలా చేయకపోతే.. వారంతా ఆత్మహత్యల వైపు మొగ్గు చపుతారు" అని చెప్పారు.