Haryana clashes Supreme Court : హరియాణాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో జరిగే నిరసనల్లో విద్వేష ప్రసంగాలు, హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది. ఉద్రిక్తతలు చెలరేగిన నూహ్ జిల్లాలో అదనపు బలగాలు మోహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.
Haryana clashes Delhi protest marches : నూహ్ హింసకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలకు సంబంధించిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు.. హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మతపరమైన సంస్థలు దిల్లీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయని ఓ జర్నలిస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం 23 నిరసన ర్యాలీలు నిర్వహించారని జర్నలిస్ట్ తరఫు న్యాయవాది.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత వాదనలు వింటామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు.
'వారి నుంచే నష్టపరిహారం వసూలు చేస్తాం'
హరియాణాలో చెలరేగిన హింసలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు ఉన్నట్లు తెలిపారు. హింసాత్మక ఘర్షణలకు సంబంధించి 116 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నూహ్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని చెప్పారు. ప్రస్తుతం అంతటా పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. 'కుట్ర పన్నిన వారిని గుర్తించాం. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని సీఎం స్పష్టం చేశారు. మరో నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి తాము పరిహారం ఇస్తామని.. ప్రైవేటు ఆస్తుల విషయంలో నిందితుల నుంచే నష్ట పరిహారం వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
'పక్కా ప్లాన్ ప్రకారమే ఘర్షణలు'
నూహ్ జిల్లాను ఎనిమిది సెక్టార్లుగా విభజించి.. ఒక్కో సెక్టార్‌కు ఒక ఐపీఎస్ అధికారిని ఇంఛార్జులుగా నియమించినట్లు హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇప్పటివరకు 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులను సైతం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్, రేవాడీ ప్రాంతాల్లోనూ అల్లర్లు జరిగాయని చెప్పారు. నూహ్ ఘర్షణలు ప్రణాళిక ప్రకారమే జరిగాయని వ్యాఖ్యానించారు.
'నూహ్ ఘటనను ఎవరో ప్లాన్ ప్రకారం చేశారు. ప్రతి ఏడాది ఆ ర్యాలీ జరుగుతోంది. కాబట్టి ఘర్షణలు అప్పటికప్పుడు జరిగినవి కాదు. కొందరు జనాన్ని పోగేశారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో రాళ్లు సేకరించి పెట్టారు. బుల్లెట్లు కాల్చారు. ఆయుధాలు ఉపయోగించారు' అని హోంమంత్రి అనిల్ విజ్ వివరించారు. హరియాణాలో హింసకు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు జరగడంపై స్పందించిన ఆయన.. ప్రతి ఒక్కరికీ తమ ఉద్దేశం వ్యక్తం చేసే హక్కు ఉందని అన్నారు. అయితే, అది శాంతియుత వాతావరణంలో జరగాలని అభిప్రాయపడ్డారు.