దేశాన్ని మరో కొత్త వైరస్ కలవరపెడుతోంది. హంకాంగ్ ఫ్లూగా పిలిచే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవలే ఈ వైరస్ బారిన పడి కర్ణాటక, హరియాణా, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సెలువులు మంజూరు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పది రోజులపాటు విద్యార్థులకు సెలవులు ఇచ్చింది. ఈ సెలవులు మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఉంటాయని ఆదేశాల్లో పేర్కొంది.
పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. హెచ్3ఎన్2 వైరస్ కేసుల సంఖ్య పెరిగితే గనుక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు తగిన వైద్య సిబ్బందితో పాటు మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు ప్రత్యేకించి ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకోసమే ముందు జగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులకు సెలవులు ఇచ్చామని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.
అయితే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకితే మాత్రం జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట వంటి ప్రధానమైన లక్షణాలను గమనించవచ్చు. దీంతో వచ్చే జ్వరం 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుందని.. కాగా, దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఇబ్బంది పెడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్‌తో ప్రస్తుతానికి పెద్ద ముప్పేమి లేనప్పటికీ జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.