తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. 134కు చేరిన మృతులు.. రంగంలోకి త్రివిధ దళాలు - gujarat cable bridge age

గుజరాత్​లో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఉదయం నాటికి మరణించినవారి సంఖ్య 134కు చేరిందని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​తో పాటు ఎన్​డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు గుజరాత్ సమాచార శాఖ తెలిపింది.

gujarat Morbi suspension bridge collapse
gujarat Morbi suspension bridge collapse

By

Published : Oct 31, 2022, 6:33 AM IST

Updated : Oct 31, 2022, 11:49 AM IST

కేబుల్ బ్రిడ్జి ప్రమాదం

Morbi bridge collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 134కు చేరుకుంది. సహాయక సిబ్బంది 177 మందిని సురక్షితంగా కాపాడినట్లు ఆ రాష్ట్ర సమాచార శాఖ పేర్కొంది. 19 మందికి గాయాలు కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్, ఎన్​డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో భాగమయ్యాయని తెలిపింది.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు
.

ప్రమాదానికి గురైన వంతెన మోర్బీ నగరంలోని మచ్చు నదిపై ఉంది. ఆదివారం సాయంత్రం సందర్శకుల తాకిడికి కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జిపై ఉన్న కొంతమంది యువకులు ఉద్దేశపూర్వకంగా వంతెనను ఊపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉండగా... వందల మంది గాయపడ్డారు.

రంగంలోకి ఎన్​డీఆర్ఎఫ్

సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి. ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని... తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

సహాయక చర్యలు

ఘటనా స్థలాన్ని గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ పరిశీలించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అంతకుముందు మోర్బీ జిల్లా కలెక్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు.. వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసిన గుజరాత్ సర్కార్‌... విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గుజరాత్‌ సర్కార్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.

బాధితులతో మాట్లాడుతున్న సీఎం భూపేంద్ర పటేల్

ప్రముఖుల స్పందన
గుజరాత్‌ వంతెన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన కలచి వేసిందన్న రాష్ట్రపతి... మిగిలిన వారు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్‌ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ... అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో సోమవారం నిర్వహించాల్సిన రోడ్‌షోను మోదీ రద్దు చేసుకున్నారు. ఘటనపై తీవ్ర విచారం తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే... సహాయ చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు. గుజరాత్‌ సర్కార్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించిందని వామపక్షాలు మండిపడ్డాయి

కేబుల్ బ్రిడ్జి సహాయక చర్యలు

తెరిచిన నాలుగు రోజుల్లోనే
మచ్చు నదిపై నిర్మించిన వేలాడే వంతెన స్థానికంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. దాదాపు 7నెలలపాటు కొనసాగిన మరమ్మతుల అనంతరం.. ఈనెల 26న బ్రిడ్జిని తిరిగి తెరిచారు. 4 రోజుల నుంచే సందర్శకులను వంతెన మీదకు అనుమతించగా.. సెలవు దినాలు కావడంతో పర్యాటకుల రద్దీ నెలకొంది. దీనిపై వంతెన సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత స్థానిక పురపాలక సంస్థ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయలేదని అధికారులు తెలిపారు.

Last Updated : Oct 31, 2022, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details