తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కులాంతర వివాహం.. యువకుడి హత్య.. యువతి తల్లిని చంపి ప్రతీకారం! - gujarat mother in law kill

Gujarat Honour killings: కులాంతర వివాహం రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. పరువు హత్యలకు దారితీసింది. ఇద్దరి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని.. యువతి తండ్రి హత్య చేశారు. ఇందుకు ప్రతీకారంగా యువతి తల్లిని.. మృతుడి బంధువులు పొడిచి చంపారు.

Jamnagar crime news
Jamnagar crime news

By

Published : May 15, 2022, 8:39 PM IST

Updated : May 15, 2022, 11:05 PM IST

Gujarat Honour killings: గుజరాత్ జామ్​నగర్​లో రెండు హత్యలు కలకలం రేపాయి. హాపా ప్రాంతంలో కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఓ షోరూం వద్ద మాటు వేసి యువకుడిని హత్య చేశారు.

ఏమైందంటే?
Jamnagar crime news: మృతుడు సోమ్​రాజ్.. ఏడాది క్రితం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కులాంతర వివాహం కావడం వల్ల యువతి కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. అయినా పెద్దలను ఎదిరించి వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అనంతరం యోగేశ్వర్​ధామ్ సొసైటీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరి పెళ్లిని నిరాకరిస్తున్న యువతి కుటుంబ సభ్యులు.. ఎప్పటి నుంచో యువకుడిని హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాజ్​కోట్ రోడ్డు వద్ద ఉన్న ఓ షోరూం సమీపంలో మకాం వేశారు. సోమ్​రాజ్ షోరూంలోకి వెళ్లగా.. వెంబడించిన యువతి తండ్రి సాతుభా ఝాలా కత్తితో పొడిచి యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

సోమ్​రాజ్​ హత్య జరిగిన షోరూం

మరోవైపు, సోమ్​రాజ్ కుటుంబ సభ్యులు సమాచారం అందుకొని షోరూంకు వెళ్లారు. యువకుడి మరణాన్ని చూసి కోపోద్రికులైన కుటుంబ సభ్యులు.. నేరుగా యువతి తల్లి ఇంటిపైకి దండెత్తారు. నిందితుడి కోసం వెతికారు. అయితే ఇంట్లో అతడి జాడ కనిపించలేదు. దీంతో యువతి తల్లి 'అషాబా సథుబా జాలా'పై దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి హత్య చేశారు.

షోరూం వద్ద పోలీసులు

ఒకేరోజు రెండు హత్యలు జరిగేసరికి జామ్​నగర్​లో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా ఎస్పీ ప్రేమ్​సుఖ్ దేలు ఘటనాస్థలాలను పరిశీలించారు. చివరకు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇరు కుటుంబాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated : May 15, 2022, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details