ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం బ్యాన్.. ఓటు వేయకపోతే రూ.51 ఫైన్! శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రమంతా ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ఊరూరా, గడప గడపకూ తిరుగుతున్నాయి. కానీ రాజ్కోట్ సమీపంలో ఉన్న రాజ్ సమాధియాలా గ్రామానికి మాత్రం ఎవరూ వెళ్లడం లేదు. ఈ గ్రామంలో ఎలాంటి ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు.
రాజ్కోట్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజ్ సమాధియాలా అనే గ్రామం. ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం పూర్తిగా నిషేధం. రాజకీయ నాయకులను ప్రచారానికి అనుమతిస్తే తమ ప్రాంతానికి ప్రమాదమని నమ్ముతారు అక్కడి గ్రామస్థులు. దీనిని కాదని ఎవరైనా వచ్చినా వారికి తిరుగుబాటు తప్పదు. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలని కట్టుబాటు పెట్టుకున్నారు ఈ ఊరి ప్రజలు. ఓటు వేయని వారికి రూ.51 జరిమానా సైతం విధిస్తారు. ఈ నిబంధనలతో గ్రామంలో ప్రతిసారీ దాదాపు 100 శాతం ఓటింగ్ నమోదవుతుంది.
"మా గ్రామంలో రాజకీయ పార్టీలు ప్రచారం చేయడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధన 1983 నుంచి కొనసాగుతోంది. ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ప్రచారం చేయదు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ప్రచారానికి రాలేదు. మమ్మల్ని కాదని ప్రచారానికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వారికి తెలుసు."
--అశోక్ భాయ్, ఉప సర్పంచ్
1700 మంది జనాభా కలిగిన ఈ గ్రామం.. అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీ గ్రామాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు విధానాలు రూపొందిస్తుంది. అవసరమైన నిబంధనలు విధిస్తుంది. వాటిని అమలు చేస్తూ.. అతిక్రమించినవారికి జరిమానా వేస్తుంది. ఎన్నికల సమయంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తుంది. ఓటు వేసేందుకు ఆసక్తి చూపనివారు కూడా ఎన్నికల్లో పాల్గొనేలా నచ్చచెబుతోంది.
గ్రామంలో ఏర్పాటు చేసిన నిబంధనల బోర్డు తమ గ్రామంలో 995 మంది ఓటర్లు ఉన్నారని.. అందరూ నచ్చినవారికే స్వచ్ఛందంగా ఓటు వేస్తారని ఓ గ్రామస్థుడు తెలిపాడు. తమ గ్రామంలో పార్టీల బ్యానర్లు, కరపత్రాలు పంపిణీ చేయడం నిషేధమని, ప్రజలందరూ కచ్చితంగా ఓటు వేసేందుకు వస్తారని మరో గ్రామస్థుడు చెప్పాడు. గత 20 ఏళ్లుగా తాను ఓటు వేస్తున్నానని.. ఇక్కడ ప్రచారం చేయడం మాత్రం పూర్తిగా నిషేధమన్నాడు.
ఎంతో ఆదర్శమైన ఈ గ్రామంలో ఆధునిక సదుపాయాలైన ఇంటర్నెట్, వైఫై, సీసీటీవీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్ వంటివి ఉన్నాయి. రాజ్ సమాధియాలా గ్రామ స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాలు వీరి బాటలో నడుస్తున్నాయి. ఈ ఊరి పక్కనున్న ఐదు గ్రామాలు కూడా తమ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిషేధించాయి. మరిన్ని గ్రామాలు తమ దారిలో నడవాలని కోరుతున్నారు గ్రామస్థులు.
నిబంధనలను వివరిస్తున్న ఉప సర్పంచ్ ఇవీ చదవండి:తండ్రి సమాధి చూడాలని ఆరాటం.. గూగుల్‌లో వెతుకుతూ తమిళనాడు నుంచి మలేసియాకు..
జపాన్ మ్యాంగోకు భారీ డిమాండ్.. కేజీ రూ.2.7లక్షలు.. సాగుకు రైతులు సిద్ధం