తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ పార్టీగా 'ఆప్'.. ఆ రాష్ట్రాలే నెక్స్ట్ టార్గెట్​! - గుజరాత్ ఎన్నికలు ఆప్

పాన్-ఇండియా పార్టీగా మారి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్​కు గుజరాత్ ఎన్నికలు బాగానే ఉపయోగపడ్డాయి. సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైనా.. ఆప్ 'నేషనల్ పార్టీ' ట్యాగ్​ను దక్కించుకుంది.

GUJARAT ELECTION 2022 AAP NATIONAL POLITICS
GUJARAT ELECTION 2022 AAP NATIONAL POLITICS

By

Published : Dec 8, 2022, 4:46 PM IST

Updated : Dec 8, 2022, 6:12 PM IST

గుజరాత్ ఎన్నికలు ఆమ్​ఆద్మీ పార్టీకి మిశ్రమ ఫలితాలు అందించాయి. ఐదంటే ఐదే సీట్లు వచ్చినా.. జాతీయ ప్రత్యామ్నాయం అంటున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆశలకు జీవం పోశాయి. నాలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సంపాదించుకున్న చీపురు పార్టీ.. జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడ్డాలో దాదాపు 13 శాతం ఓట్లు గెలుచుకొని దేశానికి బలమైన సందేశం పంపింది.

"ఈరోజు ఆప్​ జాతీయ పార్టీగా అవతరించింది. 10 ఏళ్ల క్రితం ఆప్​ ఓ చిన్న పార్టీ. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తోంది."
-అరవింద్ కేజ్రీవాల్, ఆప్​ అధినేత

"పదేళ్లలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా దక్కించుకుంది. గుజరాత్ ప్రజల వల్లే ఈ గుర్తింపు లభించింది. ఇందుకు గుజరాత్ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇది పార్టీ అభివృద్ధిని సూచిస్తోంది. గుజరాత్​ను భాజపా అడ్డాగా చెబుతుంటారు. అయినప్పటికీ ఆప్ 35 లక్షల ఓట్లు సాధించగలిగింది. పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేశారు. ఓట్ల కోసం ప్రతి గ్రామంలో తిరిగారు."
-సంజయ్ సింగ్, ఆప్ రాజ్యసభ ఎంపీ

అందరికీ ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, ఉచిత విద్యుత్, అదనంగా పలు తాయిలాలు, క్లుప్తంగా 'దిల్లీ మోడల్'.. ఇవే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాస్త్రాలు. విద్య, వైద్యం విషయంలో అజెండాలతో పనిలేదు. జాతీయ స్థాయిలో సామాన్యులను ఆకట్టుకునేందుకు అవి సరిపోతాయి. ఈ సూత్రాన్నే నమ్ముకొని ఆప్ రంగంలోకి దిగింది. దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. సామాన్యుల అభివృద్ధే తమ ధ్యేయమంటూ ప్రచారం చేసుకుంటోంది. 'దిల్లీ మోడల్'ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతూ వస్తోంది. అదే నినాదంతో అంచెలంచెలుగా ఎదుగుతోంది. మొదట దిల్లీని తన అడ్డాగా మార్చుకుంది. క్రమంగా పక్కరాష్ట్రాలపై గురి పెట్టింది. పంజాబ్​ను 'హస్తం' నుంచి లాగేసుకుంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగిన గోవాలో పోటీ చేసిన ఆప్.. 6.8శాతం ఓట్లతో రెండు సీట్లు గెలుచుకుంది.

టార్గెట్ గుజరాత్..
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో నిలిచింది. రెండు రాష్ట్రాల్లో దాదాపు అన్ని సీట్లకూ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ప్రధానంగా గుజరాత్​పైనే దృష్టిసారించింది. అంతకుముందు నుంచే గుజరాత్​లో బలమైన బేస్​ను ఏర్పాటు చేసుకుంది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది. హిమాచల్​లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయినా.. గుజరాత్​లో మాత్రం భారీగా ఓటు బ్యాంకును ఏర్పరచుకోవడంలో సఫలమైంది. పోలైన ఓట్లలో 12.88 శాతం ఓట్లను గెలుచుకుంది.

జాతీయ పార్టీ ట్యాగ్..
కేజ్రీవాల్ మాట్లాడినప్పుడల్లా.. తాను జాతీయ ప్రత్యామ్నాయం అనే చెప్పుకుంటారు. భాజపాను ఢీకొట్టడం ఆప్​తోనే సాధ్యమని చెబుతుంటారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీపై నేరుగా విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భాజపా, కాంగ్రెస్​లు బలంగా ఉన్న గుజరాత్​లో తన అస్థిత్వాన్ని చాటుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. మెరుగ్గానే పోరాడి.. భారీగా ఓట్లను రాబట్టారు. ఇప్పటివరకు దిల్లీ, పంజాబ్, గోవాలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కించుకున్న ఆప్.. తాజా ఫలితంతో జాతీయ పార్టీగా మారింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేజ్రీవాల్​కు.. 'జాతీయ పార్టీ' అనే ట్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. దేశంలో ప్రత్యామ్నాయం తామేనని కేజ్రీవాల్ మరింత దూకుడుగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది.

ఇటీవల దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ భాజపా జైత్రయాత్రకు బ్రేకులు వేసింది ఆమ్ ఆద్మీ. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్​గఢ్, రాజస్థాన్​తో పాటు భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటకలో పోటీకి సిద్ధమైంది. జమ్ము కశ్మీర్​లోనూ పోటీ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇలా, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి భాజపాను ఢీకొట్టే విపక్షంగా ఆప్ తనను తాను మలచుకుంటోంది.

Last Updated : Dec 8, 2022, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details