Crorepati Dogs : విదేశాల్లో కొన్ని పెంపుడు కుక్కలు, పిల్లుల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉందని మనం వింటుంటాం. కానీ భారత్‌లో కూడా ఓ గ్రామంలో శునకాలకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. గుజరాత్ మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో ఈ దృశ్యాన్ని మీరు చూడొచ్చు.
జంతువులకు సేవ చేస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ నమ్మకంతోనే వీధి కుక్కల బాగోగుల కోసం ఏకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. కొందరైతే తమ కోట్ల రూపాయల విలువైన భూమిని ఆ ట్రస్ట్ పేరిట రాసిచ్చారు. అంతే కాకుండా భూములను గ్రామంలోని రైతులకే కౌలుకు ఇస్తారు. ఆ కౌలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడాశునకాలపోషణ, బాగోగుల కోసం ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ శునకాల ట్రస్టు పేరిట పదెకరాల భూమి ఉంది. ఆ భూమి విలువ 90కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ శునకాలను కోటీశ్వరులని పిలుస్తుంటారు.
మరోవైపు ఈ గ్రామంలోని శునకాలు రాజభోగం అనుభవిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వాటికి ఆహారం తయారు చేయడానికి ఈ ట్రస్టు ద్వారా కొంత మంది మహిళలను నియమించి.. వారి ద్వారా ఈ గ్రామ సింహాల కోసం రోజుకు వెయ్యి రొట్టెలను తయారు చేయిస్తారు. వాలంటీర్లు వాటిని తీసుకెళ్లి శునకాలకు పెడతారు. రోటీలను కుక్కలకు అందించటానికి ఆ గ్రామంలో రెండు వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేశారు. అందులో పాటీదార్లు ఎక్కువగా ఉంటారు.
శునకాలు అనారోగ్యం పాలైనప్పుడు లేదా గాయపడినప్పుడు వాటికి వైద్యం చేసేందుకు ఓ పశు వైద్యుడిని కూడా ఈ ట్రస్ట్ నియమించింది. గ్రామ సింహాలకు 24 గంటల పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని పశు వైద్యుడు రామ్‌సింగ్ బిష్ణోయ్ తెలిపారు. ఎప్పుడు జంతువులను తీసుకొని వచ్చినా వైద్యం చేస్తామన్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ కుక్కలు ఉన్నాయని చెప్పారు. శునకాలతో పాటు పశువుల బాగోగులను కూడా ఈ ట్రస్టు చేపడుతోంది. రానున్న రోజుల్లో పక్షుల కోసం గూళ్లు కూడా నిర్మించాలని ఈ ట్రస్టు యోచిస్తోందని ఆయన అన్నారు.