దేశ పశ్చిమ తీరం ప్రకృతి వైపరీత్యం సుడిలో చిక్కుకొంది. కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలను తుడిచిపెట్టి, ఆరుగురు ప్రాణాలను హరించిన 'తౌక్టే' తుపాను ఆదివారం మరింతగా బలపడింది. 'అతి తీవ్ర తుపాను'గా మారి గుజరాత్ తీరంవైపు పయనిస్తున్నట్టు వాతావరణ విభాగం ప్రకటించింది. "ఇది ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్- మహువా (భావ్‌నగర్ జిల్లా)ల మధ్య తీరాన్ని దాటనుంది" అని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయానికి తుపాను గంటకు 11 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దీవ్, దమణ్‌లలో 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.
మంగళవారం నాటికి గాలుల వేగం గంటకు 150-160 కి.మీ.కు పెరుగుతుందని, గాలి దుమారం వేగం గంటకు 175 కి.మీ.గా ఉంటుందని తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది. సోమవారం నాడు మహారాష్ట్ర తీరంలో గాలి వేగం గంటకు 65-75 కి.మీ. దుమారం వేగం గంటకు 85 కి.మీ. ఉంటుందని పేర్కొంది. ఇది క్రమేణా పెరిగి గుజరాత్‌వైపు పయనిస్తుందని వివరించింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక, జామ్‌నగర్, భావ్‌నగర్ జిల్లాల్లో గాలి దుమారం తీవ్రత అధికంగా ఉండనుంది. జునాగఢ్ జిల్లాలో సముద్ర అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడే ప్రమాదం ఉంది. దీవ్, గిర్‌సోమనాథ్, అమ్రేలీ, భరూచ్, భావ్‌నగర్, అహ్మదాబాద్, ఆనంద్, సూరత్‌లలో తీరప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. తౌక్టే దెబ్బకు కర్ణాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేరళను భారీ వానలు ముంచెత్తాయి. తుపాను పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. తగిన ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.
భావ్‌నగర్‌కు తీవ్రమైన హెచ్చరికలు
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. భారీ గాలుల కారణంగా ఈ జిల్లాలో మట్టి ఇళ్లు పూర్తిగా కూలిపోవచ్చని, కచ్చా, పక్కా ఇళ్లకు కూడా నష్టం జరగవచ్చని అధికారులు తెలిపారు. చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయి విద్యుత్తు, సమాచార రంగాలకు అంతరాయం కలిగే ప్రమాదముంది. రైళ్ల మార్గాలతో పాటు, రహదారులపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ప్రాణ నష్టం జరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ఓఖా-పూరీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు.
సురక్షిత ప్రాంతాలకు లక్షన్నర మంది
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లక్షన్నర మందిని ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాష్ట్రంలో 44 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు 10 రాష్ట్ర బృందాల జవాన్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు. అవసరమైతే సైన్యం కూడా రంగంలో దిగనుంది.
1500 ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
గుజరాత్‌లోని సుమారు 1500 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలు జరుగుతున్నాయి. తుపాను కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. తగినంత ప్రాణవాయువును నిల్వ చేసింది. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. సోమ, మంగళవారాల్లో టీకా కార్యక్రమా లను రద్దు చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్లో తయారీకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
మహారాష్ట్రలో నేడు కుంభవృష్టి
మహారాష్ట్రలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయ్‌గడ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర కొంకణ్, ముంబయి, ఠాణె, పాల్ఘాడ్‌లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే వీలుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకు ముంబయిలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్‌లోని 580 మంది కరోనా రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కర్ణాటకలో నలుగురి మృతి
కర్ణాటకలో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లాలో తన పడవను కట్టడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని మరో పడవ వచ్చి ఢీకొనడంతో ఆయన మరణించాడు. పిడుగుపాటు, విద్యుదాఘాతం, ఇల్లు కూలిన దుర్ఘటనల్లో మిగిలిన ముగ్గురు మృతి చెందారు. ఏడు జిల్లాల్లోని 98 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. 70-80 కి.మీ.వేగంతో గాలులు వీచాయి. ఉడుపి జిల్లాలోని నాడలో 385 మి.మీ. వర్షపాతం నమోదయింది. ముఖ్యమంత్రి యడియూరప్ప పరిస్థితులను సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారని తెలిపారు. అత్యవసరమైతే మంత్రులకు నేరుగా ఫోన్ చేయాలని అధికారులకు సూచించారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్, మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సేవలు అందిస్తున్నట్టు రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.