Gujarat Boat Capsized News : గుజరాత్ వడోదరాలోని హర్ణి మోట్నాథ్ సరస్సులో జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు, వీరంతా విహారయాత్ర కోసం వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి కుబేర్ దిండోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"విద్యార్థులు ప్రయాణిస్తున్న బోటు సరస్సులో బోల్తాపడినట్లు నాకు సమాచారం అందింది. విహారయాత్ర కోసం వచ్చిన మొత్తం 27 మంది విద్యార్థులు ఈ బోటు ఎక్కారు. ప్రమాదవశాత్తు ఇది నీటమునిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా ఇతర రెస్క్యూ ఏజెన్సీ బృందాలు గల్లంతయిన మిగతా విద్యార్థుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి."
- కుబేర్ దిండోర్, గుజరాత్ విద్యాశాఖ మంత్రి
ఏడుగురిని సేఫ్గా
రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులను కాపాడినట్లు ఫైర్ ఆఫీసర్ చీఫ్ పార్థ్ బ్రహ్మ్భట్ వెల్లడించారు. తమ బృందం ఘటనాస్థలికి చేరేకన్నా ముందే కొందరు స్థానికులు విద్యార్థులను కాపాడినట్లు ఆయన తెలిపారు. విహారయాత్రలో భాగంగా బోటింగ్ కోసం వచ్చిన 27 మందిలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా న్యూ సన్రైజ్ స్కూల్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.
'బోటులో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థుల్లో కేవలం 11 మంది మాత్రమే లైఫ్ జాకెట్లను ధరించారు. మిగతావారంతా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా 10 మందిని రక్షించగలిగాము. వీరిలో కూడా ఒక విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరొక విద్యార్థిని ఎస్ఎస్జీ ఆస్పత్రికి తరలించాము' అని ఫైర్ ఆఫీసర్ చీఫ్ చెప్పారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరిగా ఘటనాస్థలికి చేరుకుంటున్నారు.