అనూహ్య పరిస్ధితుల మధ్య గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా (Vijay Rupani Resignation) చేసిన వేళ ఆయన వారసుడి ఎంపికపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. భాజపా దూతలుగా గుజరాత్‌లో మకాం వేసిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఇప్పటికే.. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సహా పలువురు మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. కొత్త సీఎం ఎంపికపై (Gujarat CM News) గుజరాత్ భాజపా శాసనసభాపక్షం నేడు సమావేశమయ్యే అవకాశం ఉంది.
సమావేశానికి అమిత్ షా..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah gujarat) సహా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త సీఎం పదవికి రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పటేల్ సామాజిక వర్గానికి సీఎం పదవి కట్టబెడతారని ఊహాగానాలు వస్తుండగా ఆ వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, వ్యవసాయ మంత్రి ఆర్సీ ఫాల్దూ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనుండడం, పటేల్ సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో కొత్త సీఎం ఎంపికపై భాజపా ఆ కోణంలోనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం.