Govt Orders on Implementation of Esma on Anganwadis: సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబరు 2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనంలో కోత విధించింది.
అంగన్వాడీ వర్కర్లకు కిందటి నెల వేతనం కింద 3 వేల 450 కోత విధిస్తూ కేవలం 8వేల 50 రూపాయలను మాత్రమే జమ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు తేల్చిచెప్పారు.
Anganwadis React on ESMA Act:రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అంగన్‌వాడీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా చట్టం ఉత్తర్వులను విజయవాడ ధర్నా చౌక్‌లో తగలబెట్టి, నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ, గత 26 రోజులుగా ఆందోళన చేస్తోన్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఎస్మా చట్టం జీవో కాపీలు దహనం - జైల్ భరోకు కార్మిక నేతలు పిలుపు
Anganwadi Workers Fire on CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విజయవాడలో కార్మిక సంఘాల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నేతలు మాట్లాడుతూ అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ''కార్మికులతో ప్రభుత్వం ఘర్షణకు దిగడం సరైన పద్దతి కాదు. ప్రభుత్వ వైఖరి వల్ల 25 రోజులుగా సమ్మె చేస్తున్నాం. నాలుగేళ్లుగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ఇచ్చిన హామీ అమలు చేయాలనే అంగన్‌వాడీలు కోరుతున్నారు. నాలుగు రోజులు చర్చించినా రూపాయి జీతం పెంచరా ? కార్మికులు తిరగబడితే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది. అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం'' అని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు - 25వ రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళన
'అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది': అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించటాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు. హామీల అమలు కోసం శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు.
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ట అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జగన్ అహంకారానికి అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని లోకేశ్ స్పష్టం చేశారు.
జగనన్న పోవాలి చంద్రన్న రావాలి- 21వ రోజు అంగన్వాడీల నిరసన