వ్యవసాయ చట్టాలపై.. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. చట్టాల రద్దు ప్రసక్తే లేదని, సవరణలకు సిద్ధమంటూ కొన్ని ప్రతిపాదనలను కేంద్రం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు తమ వైఖరిని తెలియజేశాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పునరుద్ఘాటించాయి.
కేంద్రం ప్రతిపాదనలపై చర్చించి.. మీడియా సమావేశం నిర్వహించారు రైతు సంఘాల ప్రతినిధులు. వ్యవసాయ చట్టాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తున్నట్లు హెచ్చరించారు. తమ తదుపరి కార్యచరణను ప్రకటించారు.
షెడ్యూల్ ఇదే..
- డిసెంబర్ 12 నాటికి దిల్లీ-జైపుర్, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారుల దిగ్బంధం
- 12న అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు
- 12వ తేదీ తర్వాత భాజపా నేతల ఘొరావ్
- 14వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనలు
14న దిల్లీకి వెళ్లే అన్ని ప్రధాన జాతీయ రహదారులను అడ్డుకోనున్నట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా దిల్లీ ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా దేశ రాజధానిలో ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
షాతో తోమర్ భేటీ..
కేంద్రం ప్రతిపాదనలను రైతులు తిరస్కరించిన నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఇంకా అయిపోలేదు..!
రైతులతో ప్రభుత్వం చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇదే చివరిసారి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.