2022లో జరగనున్న దేశ 75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం, మార్గదర్శకాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించే ఈ కమిటీలో 259 మందికి చోటు కల్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల గవర్నర్‌లు, కేంద్ర మంత్రులు, 28 రాష్ట్రాల సీఎంలు, ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు కూడా కమిటీలో చోటు కల్పించారు.
నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్, గాయని లతా మంగేష్కర్,గాయకుడు కేజే ఏసుదాస్ కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, దర్శకుడు రాజమౌళి, బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా చోటు దక్కింది.