'ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విత్తనోత్పత్తి పెంచడానికి భారీ స్థాయి సంస్థాగత ఏర్పాట్లు చేసినా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం సమస్యగానే ఉంది' - పదో పంచవర్ష (2002-07 )ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష సందర్భంగా అప్పటి ప్రణాళిక సంఘం చేసిన వ్యాఖ్యానమిది. రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతుండటం ఎవరి వైఫల్యం? రైతులను నాసిరకం విత్తనాల నుంచి కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది జవాబు దొరకని ప్రశ్నగా మారింది. తొలకరి వర్షాలు మొదలు కాగానే దుక్కులు దున్ని- విత్తనాల కోసం దిక్కులు చూస్తున్న రైతులకు నాసిరకం విత్తులమ్మి దోచుకునే వ్యాపార వర్గాల కార్యక్రమం ఊపందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నాసిరకం విత్తనాల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేసి- అమ్మేవారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపాలన్నారంటే వీటి అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కొరవడిన ప్రణాళిక
క్రితం సంవత్సరం 2.90 కోట్ల ఎకరాల్లో సోయాచిక్కుడు పంటను రైతులు సాగుచేస్తే 1.34 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది సోయా సాగుకు విత్తనాల కొరత ఉందని కేంద్ర వ్యవసాయశాఖే తాజాగా ప్రకటించింది. ఇప్పుడు విత్తనాలివ్వాలంటే ఏడాది ముందే విత్తన పంటలు వేయాలి. కొరత వల్ల రైతులకు ఈ సీజన్‌లో సోయా విత్తనాలను రాయితీపై ఇవ్వలేకపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తెలిపింది. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంతో ప్రైవేటు కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిరుడు తెలంగాణ వ్యవసాయశాఖ సోయా విత్తనాలను రైతుకు క్వింటా రూ.5,727కు అమ్మింది. ఈ ఏడాది ప్రభుత్వాలే విత్తనాలు లేవని చెప్పడం వల్ల ప్రైవేటు కంపెనీలు క్వింటా విత్తులను రూ.11,200కి పైగా వసూలుచేస్తున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలో క్వింటాకు అదనంగా రూ.5,423 చొప్పున ధర పెరగడం గమనార్హం. ఒకవైపు ప్రభుత్వాలు విత్తనాలు లేవని చెబుతున్నాయి. మరి ప్రైవేటు కంపెనీలకు ఎక్కడి నుంచి వచ్చాయనేదీ అంతుచిక్కని వైనం. సోయాతోపాటు పత్తి, వరి, మొక్కజొన్న, కంది... ఇలా ప్రతి పంటలో నాసిరకం విత్తనాలను ధరలు పెంచి మరీ అమ్ముతున్నారు. విత్తనాల పంపిణీని కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేసే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలు రైతులతో ఏడాది ముందే విత్తన పంటలు వేయించి- ఆ పంటలను కొని, శుద్ధి చేసి మరుసటి ఏడాది తొలకరిలో రైతులకు తక్కువ ధరలకు అమ్మాలి. కానీ చాలా రాష్ట్రాల సంస్థలు అసలు విత్తన పంటలే పండించడం లేదు. జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాల కొరత తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. వీటిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు కంపెనీల నుంచి తెలుగు రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థలు అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. ఇలాగే సోయా వంగడాలను మధ్యప్రదేశ్ కంపెనీల నుంచి కొంటున్నాయి. ఈ కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు పెంచుతూ ఏటా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలతో ఆడుకుంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలనే నేరుగా విత్తనాలు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సంస్థ అడిగితే- అవి చేతులెత్తేశాయి. ఆఖరికి జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నా అది- కొరత ఉన్న చోట సరఫరా చేసే బాధ్యత తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ విత్తన సంస్థలే ఏటా సీజన్ ఆరంభంలో హడావుడిగా టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీల నుంచి కొని రైతులకు సరఫరా చేస్తున్నాయి. ఆ విత్తనాలూ మొలకెత్తక రైతులు నష్టపోతున్న ఉదాహరణలు కోకొల్లలు. నాసిరకం విత్తనాల నుంచి రైతులను కాపాడాలంటూ ఆదేశాలిచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు- విత్తనాభివృద్ధి సంస్థలకు నిధులు సమకూర్చి విత్తన పంటలు సాగు చేయించడంపై దృష్టి సారించకపోవడం విడ్డూరం.
నాణ్యతతోనే ఆహారభద్రత