దిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో సమానమైన అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండేలా తీసుకొచ్చిన "ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ సవరణ చట్టం- 2021"ను నోటిఫై చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు.. మంగళవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొంది. ఇకపై దిల్లీ సర్కారు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా లెఫ్టినెంట్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి కానుంది.
ఈ చట్టం గత పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళనల మధ్యే ఉభయసభల్లో ఆమోదం పొందింది. ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సమయంలో.. భారత ప్రజాస్వామ్యానికి ఓ విషాదకరమైన రోజుగా పేర్కొన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ దిల్లీ ప్రజలకు అవమానకరమైనదిగా పేర్కొన్నారు.