నందిగ్రామ్లోకి ఇతర రాష్టాలకు చెందిన గూండాలు వచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్వ మిడ్నాపుర్ జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలను కొందరు బయటి వ్యక్తులు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. ఓటమి భయంతోనే మమత ఇలా చేస్తున్నారని విమర్శించింది.
భాజపా ఫిర్యాదు..
భాజపా మద్దతుదారులను మమతా బెనర్జీ బెదిరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఆమె చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే పలు చోట్ల హింస చెలరేగిందని ఆరోపించారు. మార్చి 29న నందిగ్రామ్ ర్యాలీలో మమత ప్రసంగాన్ని ఆధారంగా చూపారు. " బంగాల్లో ప్రస్తుతం ఉన్న కేంద్ర పారామిలటరీ బలగాలు కొద్ది రోజుల తర్వాత వెళ్లిపోతాయి. నేను మాత్రం ఈ రాష్ట్రంలోనే ఉంటా. నా ప్రత్యర్థులను ఎవరు కాపాడుతారు?" అని ఓ సమావేశంలో మమత అన్నారు.
ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమే కాక, ఓటర్లను ప్రభావితం చేసేలా మమత మాట్లాడారని ఆరోపించింది.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బంగాల్లో 30 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి బరిలో ఉన్న నందిగ్రామ్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.