Goldy Brar Terrorist :కెనడాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, అలాంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు తీసుకుంటున్న పలు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గోల్డీ బ్రార్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేరుస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఆశ్రయం పొందుతున్న గోల్డీ బ్రార్‌కు, నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ 'బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్'తో సంబంధాలు ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.
గోల్డీ బ్రార్‌కు సీమాంతర ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అతడు అతివాద భావజాలాన్ని వ్యాపింప చేయడం సహా, పలువురు జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు కాల్స్ చేసినట్లు ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా దేశంలోని కొంతమంది ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గోల్డీ బ్రార్ తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా వివరాలు వెల్లడించింది.