Golden Temple Death: పంజాబ్ అమృత్సర్లో షాకింగ్ ఘటన జరిగింది. స్వర్ణ మందిరంలో చొరబడిన ఆగంతుకుడు.. అక్కడున్న కత్తిని తీసుకుని.. గురుగ్రంథ్ సాహిబ్ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో.. ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) టాస్క్ఫోర్స్ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మృతిచెందినట్లు అమృత్సర్ డీసీపీ పరమీందర్ సింగ్ బందాల్ తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వివరించారు.
"ఆగంతుకుడికి 20-25 ఏళ్ల వయసు ఉంటుంది. దేవాలయంలోకి చొచ్చుకుని వచ్చాడు. గురుగ్రంథ్ సాహిబ్ వద్ద ఉన్న కత్తిని తీసుకొని ఆలయాన్ని అపవిత్రం చేయబోయాడు. ఆ తర్వాత భక్తులు యువకుడిపై దాడి చేశారు. యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతిచెందాడు."
-- పరమీందర్ సింగ్ బందాల్, అమృత్సర్ డీసీపీ
మృతదేహాన్ని అమృతసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పరమీందర్ సింగ్ తెలిపారు. యువకుడి పోస్ట్మార్టం ఆదివారం జరుగుతుందన్నారు. భక్తులంతా సంయమనం పాటించాలని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
ఈ ఘటనకు సంబంధించి స్థానిక సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారిస్తున్నామని తెలిపారు.