goa hung assembly: గోవాలో ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సోమవారం వెలువడగా.. గోవాలో హంగ్ తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. భాజపా, కాంగ్రెస్కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాదని తేల్చేశాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర గోమంత్ పార్టీ, స్వతంత్రులతో భాజపా కేంద్ర నాయకత్వం చర్చలు ముమ్మరం చేసింది. ఫలితాల అనంతరం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీతో పొత్తుపెట్టుకున్న ఎంజీపీతో జతకట్టేందుకు భాజపాతో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై గోవా సీఎం సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"మెజార్టీ తగ్గితే స్వతంత్ర ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ మద్దతు తీసుకుంటాం. ఎంజీపీ చేసిన కచ్చితమైన డిమాండ్ల గురించి నాకు తెలియదు. మా కేంద్ర నాయకత్వం వారితో మాట్లాడుతోంది"
-ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి
అలాగే మంగళవారం ప్రధాని మోదీని గోవా సీఎం ప్రమోద్ సావంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా బలమైన పనితీరు కనబరించిందని ప్రధానికి వివరించినట్లు భేటీ అనంతరం సావంత్ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందనే అశాభావాన్ని ప్రధానికి తెలియజేశానని అన్నారు.
2017 గోవా శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మెుత్తం 40 స్థానాలకుగానూ కాంగ్రెస్ 17 స్థానాలు, భాజపా 13 స్థానాల్లో విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.