Global Biofuel Alliance Launch PM Modi: జీ20కి నాయకత్వం వహిస్తున్న భారత్.. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చే దిశగా మరో కొత్త కూటమిని ఆవిష్కరించింది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ 'ప్రపంచ జీవ ఇంధన' కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీ20 సదస్సులో ( G20 Summit 2023 ) భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన 'ఒకే భూమి' కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
"జీవ ఇంధనాల విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం తక్షణావసరం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం వరకు కలపాలని మేం ప్రతిపాదిస్తున్నాం. లేదంటే సరికొత్త ప్రత్యామ్నాయ మిశ్రమాన్ని అభివృద్ధి చేసేందుకు మనం ప్రయత్నించవచ్చు. అలా జరిగితే.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే, ఇంధన సరఫరాకు లోటు లేకుండా చూడటం సాధ్యమవుతుంది."
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
What Is Biofuel Alliance :వాతావరణ మార్పులు, ఇంధన భద్రతపై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. భారత్ తాజా కూటమిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ ఇంధన పరివర్తనకు మద్దతుగా స్థిరమైన ఇంధనం అభివృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా.. ఈ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో జీ20 సభ్యులంతా భాగం కావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇంధన పరివర్తన కోసం ట్రిలియన్లకొద్దీ వ్యయం అవుతుందని పేర్కొన్న ఆయన.. అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు.
"పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ఇంధన పరివర్తన సాధించడం 21వ శతాబ్దానికి అత్యంత కీలకం. సమ్మిళిత ఇంధన పరివర్తన కోసం ట్రిలియన్లకొద్దీ వ్యయం అవుతుంది. పర్యావరణం కోసం 100 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అభివృద్ధి చెందిన దేశాలు ప్రకటించాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ మేరకు సానుకూల చొరవ తీసుకోవడం సంతోషకరం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
అమెరికా, కెనడా, బ్రెజిల్ సహా ( Global Biofuel Alliance Members ) ప్రపంచ జీవ ఇంధన కూటమిలో 15కుపైగా దేశాలు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, కోపెన్హేగెన్లో 2009లో నిర్వహించిన ఐరాస పర్యావరణ సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు '100 బిలియన్ డాలర్ల హామీ'ని ఇచ్చాయి. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని ప్రకటించాయి. కానీ ఈ హామీని సంపన్న దేశాలు నిలబెట్టుకోలేకపోయాయి.