వేదభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు ఘటనలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న కార్చిచ్చుల వల్ల జంతువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. చెట్లు కూడా అదే స్థాయిలో దగ్ధం అవుతున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత ఇప్పటికే దెబ్బతింటోంది. అంతేగాక వాయుకాలుష్యం అధికమవుతోంది. వీటి వల్ల పొగమంచు పెరిగి.. పక్కన ఉన్న హిమానీనదాలు(గ్లేషియర్స్) కరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయిదాటి పోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"అడవుల్లో ఏర్పడే కార్చిచ్చు గాలిని కలుషితం చేస్తోంది. పీఎం-10, పీఎం-2.5ల శాతాన్ని, కార్బన్ను పెంచుతోంది. దీంతో హిమాలయ ప్రాంతాలలో ఉండే హిమానీనదాలు కరుగుతున్నాయి. ఇవి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో కచ్చితంగా జీవవైవిధ్యం, పర్యావరణంపై ప్రభావం పడుతుంది. అలానే ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఈ విధంగా సగటు మానవుని ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది."
-సీ కునియల్, సీనియర్ శాస్త్రవేత్త, జీబీ పంత్ నేషనల్ హిమాలయ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్
ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు ఏటా పెరిగిపోతున్నాయని నైనితాల్ ఆర్యభట్ట అబ్జర్వేషన్ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త మనీష్ నాజా అన్నారు. వీటి వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో వెలువడే ప్రాణాంతక వాయువుల పరిమాణం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విషవాయువులు పెరగడం.. వాతావరణంతో పాటు మానవాళికి చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.