దేశ రాజధానిలో 11 ఏళ్ల బాలికపై దారుణం జరిగింది. దిల్లీలోని ఓ కేంద్రీయ విద్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పట్ల ఈ ఘోరానికి పాల్పడింది సీనియర్ విద్యార్థులే కావడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటన జులైలోనే జరగ్గా.. దిల్లీ మహిళా కమిషన్ చొరవతో బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించడం వల్ల వెలుగులోకి వచ్చింది. మరోవైపు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది.
టాయిలెట్లోకి లాక్కెళ్లి ఘోరం..
ఈ ఘటనపై డీసీడబ్ల్యూ తెలిపిన వివరాల ప్రకారం.. జులైలో బాధితురాలు తరగతి గదికి వెళ్తున్న క్రమంలో యాదృచ్చికంగా 11, 12 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. ఆపై తాను క్షమాపణలు చెప్పినా వారు దూషించారని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తనను బలవంతంగా టాయిలెట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారని బాలిక వాపోయింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలికి చెప్పినా పట్టించుకోలేదని, వారిని బహిష్కరించినట్టు చెప్పి ఊరుకున్నారని బాలిక చెప్పినట్టు కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, పాఠశాల అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేవీఎస్ అధికారులు తెలిపారు. ప్రాంతీయ కార్యాలయం దీనిపై దర్యాప్తు చేస్తోందన్నారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయలేదని.. ఈ ఘటన తర్వాత జరిగిన టీచర్లు- తల్లిదండ్రుల సమావేశంలోనూ తమ దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు తర్వాతే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దిల్లీ పోలీసుల దర్యాప్తునకు తాము సహకరిస్తామని కేవీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని.. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బోధనా సిబ్బంది, అనుమానిత విద్యార్థులను విచారించినట్టు పోలీసులు వెల్లడించారు.