ఉత్తర్ప్రదేశ్లో హృదయవిదారక ఘటన జరిగింది. తన బర్త్డే నాడే రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అసలేం జరిగిందంటే..గ్రేటర్ నోయిడా పరిధిలోని దుజానా గ్రామానికి చెందిన సాక్షి(2) అనే చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి ప్రాణాలు విడిచింది. కాగా, అదే రోజు చిన్నారి జన్మదినం కావడం వల్ల ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చిన్నారి తన అన్నయ్యతో ఆడుకుంటుండగా కుటుంబ సభ్యులు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో అక్కడే బట్టలు ఉతికేందుకు ఏర్పాటు చేసిన ఓ నీళ్ల తొట్టిలో బాలిక పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.
దుజానా గ్రామానికి చెందిన చంద్రపాల్కు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మృతురాలు సాక్షియే చివరి సంతానం. మార్చి 12న చిన్నారి ఇంట్లోనే ఉత్సాహంగా ఆడుకుంది. కాగా.. సాక్షి తండ్రి చంద్రపాల్ కేక్ తేవడం కోసం బయటకు వెళ్లాడు. సాక్షి దగ్గర తన నాలుగేళ్ల కుమారుడిని వదిలి వెళ్లాడు. కాగా, చెల్లి ఆడుకుంటుందని అన్న కూడా ఆడుకునేందుకు పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలోనే సాక్షి ప్రమాదవశాత్తు నీళ్లున్న తొట్టిలో పడి మరణించింది.