ఉత్తర్ప్రదేశ్ హథ్రస్లో మరో దారుణ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
సాదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ బాలిక అక్టోబర్ 10న కోచింగ్ సెంటర్కు వెళ్లింది. అనంతరం తిరిగి వస్తున్న ఆమెను ఐదుగురు నిందితులు అడ్డగించారు. ఆమెకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను.. సమీపంలోని ఇంటర్ కాలేజీ ఆవరణలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. అనంతరం కోచింగ్ సెంటర్ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం బయట చెబితే చంపేస్తామంటూ బెదిరించడం వల్ల బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల యువతిని ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టింది.