విద్యార్థి మరణంపై గాంధీజీ యంగ్‌ఇండియా పత్రికలో ఉద్వేగంగా స్పందించారు. "అహో! ఎలాంటి మరణం అది? ప్రతి ఒక్కరూ అసూయపడేది. గణేశ్ శంకర్ విద్యార్థి చిందించిన రక్తం హిందూ-ముస్లింల బంధాన్ని సిమెంటులా పటిష్ఠం చేస్తుందని నమ్ముతున్నాను. ఆయన మరణం పాషాణహృదయాలను కరిగిస్తుందనుకుంటున్నాను. సంక్లిష్ట పరిస్థితుల్లో మనందరికీ ఆయనో ఉదాహరణ" అంటూ రాశారు గాంధీజీ.
1890 అక్టోబరు 26న అలహాబాద్ దగ్గర్లో జన్మించిన గణేశ్ శంకర్ విద్యార్థి (ganesh shankar vidhyarthi birth place) ఆర్థిక కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేక పోయారు. కానీ పత్రికా వ్యాసంగంపై మక్కువ ఉండేది. గదర్ ఉద్యమ నేత పండిత్ సుందర్‌లాల్ పత్రిక 'కర్మయోగి'లో వ్యాసాలు రాసేవారు. తర్వాత కాన్పుర్‌కు మారి తానే సొంతగా ప్రతాప్ అనే వారపత్రిక స్థాపించారు. స్వాతంత్య్రోద్యమం గురించే కాకుండా.. భారతీయ సమాజంలోని అసమానతలు, అవలక్షణాల గురించి కూడా రాసేవారు గణేశ్. ఆ సమయంలో కాన్పుర్ జాతీయోద్యమానికి కీలకంగా ఉండేది. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతోంది. దీంతో కార్మికుల సమస్యలు, రాయ్‌బరేలీ రైతుల కష్టాల గురించీ గణేశ్ ప్రజల దృష్టికి తీసుకొచ్చేవారు. జాతీయోద్యమం కేవలం ఇంగ్లిష్ చదువుకున్న ఉన్నతవర్గాలకే పరిమితం కాకుండా.. సామాన్యులకూ చేరువకావాలని భావించేవారు. గాంధీని కలిసిన తర్వాత నేరుగా జాతీయోద్యమంలోకి దూకారు గణేశ్. కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటున్నా తన పత్రికతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం మాత్రం మానలేదు. ఫలితంగా ఐదారుసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
వ్యక్తిగత స్వేచ్ఛ కోసం..
గాంధీజీ బాటలో పయనించినా.. విప్లవకారులతోనూ సత్సంబంధాలు (azadi ka amrit new story) కొనసాగించిన గణేశ్ విద్యార్థి.. ప్రశ్నించటం మానలేదు. కాంగ్రెస్ సీనియర్ నేతలనూ నిలదీసేవారు. "ఒకవేళ భారత్‌కు స్వాతంత్య్రం వస్తే అదెవరి కోసం? తెల్లవారి స్థానంలో మన దొరలు వస్తారా?" అంటూ.. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం నినదించేవారాయన. లాహోర్ కేసు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన భగత్‌సింగ్‌కు కొద్దిరోజులు కాన్పుర్‌లో గణేశ్ విద్యార్థి ఆశ్రయమిచ్చారు. అంతేగాకుండా తన పత్రిక ప్రతాప్‌లో భగత్‌సింగ్ భావాలను, వ్యాసాలను ప్రచురించారు. మరో విప్లవవీరుడు చంద్రశేఖర్ ఆజాద్, కాంగ్రెస్ నేత జవహర్‌లాల్ నెహ్రూల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు.